News

సీఎం విజయన్ క్షమాపణలు చెప్పాల్సిందే : భారతీయ విచారణ కేంద్రం

244views

సనాతన ధర్మం విషయంలో, నారాయణ గురు విషయంలో మాట్లాడిన మాటలకు కేరళ సీఎం పినరయ్ విజయన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని భారతీయ విచారణ కేంద్రం డిమాండ్ చేసింది. సీఎం లాంటి స్థాయిలో వున్న వ్యక్తి సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారతీయ విచారణ కేంద్రం కేరళ శాఖ డైరెక్టర్ సంజయన్ అన్నారు. గత పది సంవత్సరాలుగా భారతయుల ఆత్మవిశ్వాసం బాగా పెరగుతోందని, అలాగే దేశంలో నిర్మాణాత్మక మార్పులు కూడా జరుగుతున్నాయని, ఈ ఉత్సాహాన్ని దెబ్బతీయడానికే భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని, భారత సంప్రదాయాలు, వారసత్వంపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.

దేశాన్ని విభజించేందుకు అనేక శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ జరగదన్నారు. ఎందుకంటే సనాతన ధర్మం ఉనికి అనేది దాని సిద్ధాంతాలు, ఆదర్శాలలో పాతుకుపోయిందని వివరించారు. ఇదే విజయానికి మార్గమన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను అత్యంత బాధ్యతతో ఎదుర్కోవాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. ఈ విషయంలో అందరూ తమ సంకల్పాన్ని మరింత దృఢం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సనాతన ధర్మం విషయంలో ముఖ్యమంత్రి పినరయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఈ కార్యక్రమం తీర్మానం చేసింది.శ్రీనారాయణ గురు సనాతన ధర్మానికి ప్రతినిధి లేదా ప్రతిపాదకుడు కాదని, సనాతన ధర్మం కులతత్వాన్ని, చాతుర్వర్ణాన్ని సూచిస్తుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ఈ తీర్మానం చేశారు. సనాతన ధర్మం అనేది మతం కాదని, వివిధ ఉపాసనలు, వ్యవస్థలతో మిళితమై వున్న సంప్రదాయమని తీర్మానంలో పేర్కొన్నారు. సనాతన ధర్మం ఓ జీవన శైలి అని తీర్మానంలో వివరించారు.