ArticlesNews

సిగ్గు లేదు, అందుకే ‘లజ్జ’ వద్దన్నారు

218views

భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్య రక్షణ గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి ఇండియా కూటమి గొంతు చించుకుంటూ ఉంటుంది. దాని నాయకుడు రాహుల్ గాంధీ నిత్యం రాజ్యాంగ ప్రతిని చేత్తో పట్టుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు తాజా ఉదంతాలను ప్రస్తావించాలి. ప్రఖ్యాత బాంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ రాసిన నాటకం ‘లజ్జ’ ప్రదర్శనను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హఠాత్తుగా నిషేధించింది. ఇంకొక పరిణామం- 36 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ హయాంలో నిషేధానికి గురైన సల్మాన్ రద్దీ వివాదాస్పద నవల ‘సాటానిక్ వర్సెస్’ మీద బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు నిషేధం తొలగి పోవడం.

‘మీరు రాసిన ‘లజ్జ’ నాటకం ప్రదర్శిస్తే, అది ముస్లింలను రెచ్చగొట్టడమే అవుతుంది. వారు దాడులకు దిగవచ్చు.’ ప్రఖ్యాత రచయిత్రి తస్లిమా నస్రీన్ కు పశ్చిమ బెంగాల్ పోలీసులు, అంటే మమతా బెనర్జీ పోలీసులు ఇచ్చిన సంజాయిషీ ఇది. తాను రాసిన నాటకం ప్రదర్శించకుండా నిషేధించినందుకు నస్రీన్ మమతా బెనర్జీని విమర్శించారు. రెండు నెలల నుంచి ఈ నాటక ప్రదర్శన గురించి అంతటా వాల్పోస్టర్లతో ప్రచారం చేసిన తరువాత కూడా హఠాత్తుగా నిషేధించడం దారుణమని తన ఫేస్బుక్ ఖాతాలో నస్రీన్ దుమ్మెత్తి పోశారు. హుగ్లీలోని గోబర్దనంగ, పాండువ వద్ద జరుగుతున్న నాటకోత్స వాలలో ఈ ప్రదర్శన ఏర్పాటయింది. ఇప్పుడు మిగిలిన అన్ని నాటకాలకు అనుమతి ఇచ్చి ఒక లజ్జను మాత్రమే నిషేధించారు. నబాపల్లి నాట్య సంస్థాన్ ఈ ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. నిజానికి ఈ నాటకం ఢిల్లీలో మూడుసార్లు ప్రదర్శించారు. అన్ని ప్రదర్శన లకు జనం ఎగబడ్డారు. ఈ నాటకం ముస్లింలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తుందని పోలీసులు చెబుతున్నారని, గతంలో కూడా ఇదే కారణం చెప్పి ఆకాశ్ 9 టీవీ చానల్లో ప్రసారం కావలసిన తన సీరియల్ దస్సహహెబాస్ను నిషేధించారని ఆమె ఆరోపించారు. లజ్జ ఇతివృత్తం బాంగ్లాదేశ్కు సంబంధించినది, కానీ అది చూసి బెంగాలీ ముస్లింలు ఎందుకు రెచ్చిపోవాలని, ఎందుకు దాడులకు దిగాలని కూడా ఆమె ప్రశ్నించారు. ముస్లింల దాడుల కారణం చెప్పే తనను బెంగాల్లో లేకుండా చేశారని ఆమె గుర్తు చేశారు. మమతా బెనర్జీ రాష్ట్రంలో కళాకారులు, రచయితల గొంతు ఎందుకు నొక్కుతు న్నారని, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడవలసిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ముస్లింలు రెచ్చిపోయి దాడులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి నాటక ప్రదర్శనను నిషేధించడం సరికాదని, ఇలా చెప్పడం శాంతిభద్రతల రక్షణ విషయంలో మమత ప్రభుత్వం విఫలమైనట్టేనని బీజేపీ ఐటీసెల్ అధినేత అమిత్ మాలవీయ విమర్శించారు. ఇలాంటి నిషేధాలు పశ్చిమ బెంగాల్ కనీవినీ ఎరుగునిదని ఆయన అన్నారు. కళ, సంస్కృతి, భావ ప్రకటనా స్వేచ్ఛలను ముస్లిం దాడుల పేరుతో అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాబట్టి మమత పదవి నుంచి వైదొలగడం మంచిదని ఆయన అన్నారు. అయోధ్యలో వివాదాస్పద మసీదు కూలిన తరువాత బాంగ్లాదేశ్లో మైనారిటీలపై (హిందువులపై) వారి ఆలయాలపై జరిగిన దాడుల ఆధారంగా నస్రీన్ ‘లజ్జ’ పేరుతో నవల రాశారు. ఆ తరువాత ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. 1993లో ఆ నవల వెలువడింది. తరువాత నుంచి ఆమె బాంగ్లాదేశ్లో అడుగు పెట్టలేకపోయారు. స్వీడన్, జర్మన్, అమెరికాలలోను చాలాకాలం ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆమె తలదాచుకుంటున్నారు.

‘సాటానిక్ వర్సెస్’ నవల గురించి కొన్ని మాటలు. సల్మాన్ రద్దీ రాసిన ఆ నవలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిషేధించింది. చిత్రం ఏమిటంటే ఈ నవల మహమ్మద్ ప్రవక్తను విమర్శించింది కాబట్టి దైవదూషణ కిందకు వస్తుందని మూడున్నర దశాబ్దాల క్రితమే ఇరాన్ కొమైనా మరణశాసనం రాశాడు. ఆ ఫత్వాను అమలు చేయడానికి రెండేళ్ల కూడా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీని మీద నిషేధం ఎత్తివేశారు. నాడు ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును నవంబర్లో కొట్టేశారు. అందుకే రాజదాని ఢిల్లీలో ఈ నవల లభ్యమవు తున్నది. రూ.1,999 ధర ఉన్నా ఎగబడి కొంటున్నారని పుస్తక విక్రేతలు చెబుతున్నారు. ఈ పుస్తకం మీద పోరాటం పేరుతో ముస్లిం మతోన్మాదులు చేసిన విధ్వంసం ఇంతా అంతా కాదు. ఫలితంగా రద్దీ పదేళ్లు అమెరికా, ఇంగ్లండ్లలో అజ్ఞాతంలో ఉండిపోయారు. ఆగస్ట్ 12,2022న అమెరికాలో ఉంటున్న లెబనాన్ మూలాలు ఉన్న హాది మతార్ రద్దీ మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రద్దీ కన్ను పోయింది. ప్రాణాలతో బతికి బయట పడ్డారు. ఈ నవలను జపనీస్ లోకి అనువదించిన హితోషి ఇగారషిని కూడా ముస్లిం మతోన్మాదులు చంపేశారు.

నిజానికి సాటానిక్ వర్సెస్ ప్రతులు పరిమితంగానే ఉన్నాయి. అయినా సరే, ముస్లిం సంఘాలు ఈ పుస్తకం అమ్మకాల మీద మండిపడుతున్నాయి. ఆ పుస్తకం మీద వెంటనే తిరిగి నిషేధం విధించాలని కోరుతున్నాయి. ఉత్తరప్రదేశ్ జమాత్ ఎ ఉలేమా ఇ హింద్ న్యాయ సలహాదారు ఒక మహత్తరమైన విషయం చెప్పారండోయ్! భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఒక మతంవారి మనోభావాలకు, అవి కూడా భారత రాజ్యాంగం ప్రసాదించినవి- దెబ్బ తగలకూడదట. సాటానిక్ వర్సెస్లో దైవ దూషణ ఉందని ఆయన తేల్చారు. కానీ దీని మీద నిషేధం ఎత్తివేసింది ఢిల్లీ హైకోర్టే మరి! అయినా సరే, ఒకసారి నిషేధించిన ఇలాంటి పుస్తకాన్ని మళ్లీ అమ్మకానికి పెట్టడం అంటే ముస్లింలలో ఉద్రేకాలను రెచ్చ గొట్టడమేనని కూడా సెలవిచ్చారు. కాబట్టి ప్రభుత్వం మళ్లీ నిషేధించాలని చెప్పారు. షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యాకుబ్ అబ్బాస్ కూడా ఇదే కోరారు. అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముస్తీ షహబుద్దీన్ రజ్వీ కూడా ఇదే కోరారు. చిత్రం ఏమిటంటే, ఆ నవలలో హిందూ దేవతల మీద కూడా కారుకూతలు ఉన్నాయి. అయినా హిందూ సంఘాలు ఇప్పటిదాకా ఎక్కడా నోరెత్తలేదు.

మేధావులు, ఉదారవాదులు, సెక్యులరిస్టులు ఈ రెండు పరిణామాల గురించి ఏం చెబుతారు? దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని తెగ వాగేవాళ్లు సాటానిక్ వర్సెస్ మీద నిషేధం ఎత్తి వేయడం, అది మార్కెట్లో రావడం గురించి ఏమంటారు?