News

చిన్మయ్ ప్రభు అరెస్టుపై నిరసనల వెల్లువ

239views

బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందువులపై దాడుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్‌ను చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపాయి.

ఇంతలో బీఎన్‌పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. చిన్మయ్ కృష్ణన్ దాస్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు మౌల్వీ బజార్‌లో ‘జై సియా రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ అని నినాదాలు చేస్తూ భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. ఇదేవిధంగా షాబాగ్‌లో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్‌పై కూడా దాడి జరిగింది. గాయపడిన ఆందోళనకారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు దాడుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ సంఘటనలను ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని, దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని సుకాంత్ మజుందార్ ట్విట్టర్‌లో రాశారు. ఆయన అరెస్టు దరిమిలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.