News

‘వక్ఫ్ తొలగించండి.. అన్నదాత’ను కాపాడండి… స్వామీజీలు, రైతుల ఆందోళన

242views

వక్ఫ్ బోర్డు రాక్షసత్వాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకతో సహా దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని ఫలితమే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా కర్నాటకలోని కల్బుర్గిలో ‘‘నేగిలయోగి స్వాభిమాన్ వేదికతో పాటు రాష్ట్రంలోని వివిధ మఠాల సాధు, సంతులు, బీజేపీ నేతలు ,రైతు నాయకులు తీవ్ర ఆందోళన చేపట్టారు. వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘వక్ఫ్ ను తొలగించండి… అన్నదాతను రక్షించండి’’ అన్న నినాదంతో ఆందోళన బాటపట్టారు. ఏకంగా మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో ప్రజలు, స్వామీజీలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.

వక్ఫ్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాధువులు, బీజేపీ నేతలు, రైతులు సీఎం సిద్ధరామయ్య, మైనారిటీ సంక్షేమ మంత్రి అహ్మద్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే వక్ఫ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘జమీర్ హఠావో… జమీన్ బచావో…వక్ఫ్ హఠావో, అన్నదాత బచావో’’ అని ప్లకార్డులు చేతబూని నిరసన చేశారు.

ఈ నిరసన సందర్భంగా ఆందోల మఠానికి చెందిన సిద్ధలింగ స్వామి రాష్ట్ర మైనారిటీ మంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ మతతత్వాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మఠాలు, దేవాలయాలు, రైతుల భూములకు వక్ఫ్ నోటీసులు జారీ చేసి, విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రవర్తన ఓ మంత్రిలా లేదని, పాక్ ఏజెంట్ గా వుందని దుయ్యబట్టారు. వక్ఫ్ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా మైనారిటీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 2047 నాటికి భారత్ ఇస్లామిక్ దేశంగా మారుతుందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చెప్పారని, ఇందుకు మంత్రి అహ్మద్ చేస్తున్న ప్రయత్నాలే తొలి అడుగు అని సిద్ధలింగ స్వామి మండిపడ్డారు.