
మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్‌సింగ్ భారీ ఫైబర్ గ్లాస్ విగ్రహం స్థానిక సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రతిష్ఠించేందుకు దీనిని తయారు చేశామని తెనాలికి చెందిన విగ్రహ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్ష విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతంలో చత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, కెంపెగౌడ, రాణి రుద్రమదేవి, రాణి కిట్టూరు చెన్నమ్మ, సంగోలి రాయన్న, కృష్ణరాజ వడియార్, బసవేశ్వర మహారాజ్ వంటి చారిత్రక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశామని, రాణా ప్రతాప్‌సింగ్ విగ్రహం తయారు చేయలేదన్న కొరత నేటితో తీరిందని శిల్పి కాటూరి చెప్పారు.
సూర్య శిల్పశాలలో ప్రదర్శించిన ఈ విగ్రహాన్ని తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు తిలకించారు. శిల్పంలో జీవకళ ఉట్టిపడుతోందని ప్రశంసించారు. శిల్పులతోపాటు విగ్రహ కమిటీ సభ్యులు భవానిసింగ్, సూర్యప్రతాప్ సింగ్, కళ్యాణ్‌సింగ్, శ్రీనివాసరావుసింగ్, అంజన్‌సింగ్, బలరాంసింగ్‌ను డీఎస్పీ శాలువాలతో సత్కరించారు. రాణా ప్రతాప్‌సింగ్ మహారాజు విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి మార్కాపురం ప్రాంతానికి వలస వచ్చిన మేవార్ వంశస్తులంతా కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు చెప్పారు.
శిల్పి కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ గత వారం అమెరికాలోని అట్లాంటాలో ఆవిష్కరించిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం కూడా తమ చేతుల మీదుగానే తమారైందని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమెరికా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో పదుల సంఖ్యలో ప్రతిష్ఠించిన విగ్రహాలను తీర్చిదిద్దే అవకాశం తమకు లభించిందని చెప్పారు. శిల్పకళలో తెనాలి ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు.





