
బుధవారం18/9/2019 నాడు కర్నూలు ప్రభుత్వ హస్పిటల్లో ఒక వ్యక్తి తీవ్రమైన జ్వరంతో అడ్మిట్ అయ్యాడు. రక్త పరీక్ష చేసిన డాక్టర్లు “ఆయనకు రక్త కణాలు 8000 కి పడిపోయాయి. వెంటనే ఎక్కించక పోతే బ్రతకడం కష్టం” అని చెప్పేశారు. వారిది నిరుపేద కుటుంబం. బంధువులు, తెలిసిన వారు ఎవ్వరూ రక్త కణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఏమీ పాలుపోని ఆ కుటుంబ సభ్యులు బెంగ పడి పోయారు. “దిక్కు లేని వారికి దేవుడే దిక్కు” అనుకున్నారో ఏమో దేవునిపై భారం వేసి దేవుని స్మరించుకుంటూ ఉండి పోయారు..
ఆ దేవుడే నిజంగా వారి మొర ఆలకించినట్టున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఓ యువకుడు “అక్కా ఆ రక్త కణాలు నేనిస్తాను” అంటూ రోగి బంధువుల ముందుకొచ్చాడు. ఆ యువకుడు ఆత్మకూరు ABVP భాగ్ కన్వీనర్ రవి కిశోర్ రెడ్డి. వెలుగోడు, ఆత్మకూరు, బండి ఆత్మకూరులలో ABVP లో మంచి కార్య క్రమాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం రాయలసీమ యూనివర్సిటీలో MBA మొదటి సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో చెరి 5 రోజులు అవుతోంది. ఎవరినో పరామర్శించటానికి ఆసుపత్రికి వచ్చిన రవి కిశోర్ రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి పరిస్థితి గమనించి రక్త కణాలు అందించి ఆయన ప్రాణం నిలబెట్టాడు.
“మేము దేవుణ్ణి తలచుకుంటే ఆ దేవుడు రవి కిశోర్ రూపంలో వచ్చి మా కుటుంబ పెద్ద ప్రాణాలు కాపాడాడు. ఆ అబ్బాయి ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం?” అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు రోగి కుటుంబ సభ్యులు. రవి కిశోర్ రెడ్డిని అందరూ ప్రశంశిస్తున్నారు. ఒక మంచి పని ద్వారా ABVP స్ఫూర్తిని అందరికీ తెలియజేసిన రవి కిశోర్ కు ABVP వెలుగోడు శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోంది.





