పాక్ ఈ ఏడాదిలో 2050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది – ఐరాస మానవ హక్కుల మండలిలో సాక్ష్యాలు చూపించిన భారత్

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్ చేసిన ఆరోపణలకు భారత్ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సరిహద్దులో ఉన్న ఉగ్రవాదుల సాయంతో పాక్ దళాలు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. భారత పౌరులు, సరిహద్దులో ఉన్న వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఇలా అడ్డదారులు తొక్కడం పాక్ మానేయాలి. ఈ ఏడాది పాక్ 2050సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇప్పటికే ఎన్నో సార్లు పాక్‌కు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోతోంది. భారత్ చాలా సంయమనం పాటించింది. ఇక మీదట దీటుగా సమాధానం చెబుతుంది’ అని తెలిపారు.





