News

ప్రపంచ భారతీయ తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తి : వెంక‌య్య నాయుడు

18views

భారతీయతత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలతో పాటు… కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు కూడా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సచ్చిదానంద మూర్తి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చైతన్యం, జ్ఞాన సముపార్జన అంశాల్లో భారత్‌ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందంజలో ఉందన్నారు.

ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు, బుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన వంటి వారిని భారతీయతత్వానికి మూలపురుషులుగా అభివర్ణించారు. తర్వాత కాలంలో జిడ్డు కృష్ణమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌తోపాటు కొత్త సచ్చిదానంద మూర్తి భారత తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. మన ఉపనిషత్తుల్లో ఎన్నో మంచి అంశాలు ఉన్నాయన్నారు. భారతీయ మూలాల్లోకి వెళ్లి మన తత్వశాస్త్రాన్ని నేటి తరానికి అందించిన మహనీయుడు సచ్చిదానంద మూర్తి అని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, యూనివర్శిటి ఉపకులపతి గంగాధరరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.