News

దసరా ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

27views

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నమని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు అన్నారు.విజయవాడలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజ‌న‌ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టికే దసరా ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు సంతృప్తికరంగా ఉండేలా అమ్మవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూలైన్లు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు నిరంతరం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు క్యూలైన్ల‌లో వేచి ఉండే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిపించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. గ‌తేడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చునన్న అంచ‌నాల నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం లగేజీ, చెప్పులు భద్రపరుచుకునేందుకు 30 క్లాక్ రూములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీ, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారికి దర్శనం కల్పించి సామాన్య భక్తులకు ఇబ్బంది కల‌గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన ప్రత్యేక డ్యూటీ పాసులను జారీ జారీచేయనున్నామని తెలిపారు. ఎప్పటిలాగే కొండపైన రాజగోపురం సమీపంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసి, మీడియా ప్రతినిధుల కోసం కంప్యూటర్లు, ఇంటర్నెట్ వైఫై వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్ర‌తినిధుల‌కు ఎదురయ్యే ఇబ్బందులను సత్వరం పరిష్కరించేలా పోలీస్, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయానికి సమాచార శాఖ అధికారులను లైజనింగ్ అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఉద‌యం 7 గం. నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు ఇలా.. మూడు షిఫ్టు్ల్లో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండేలా ప్ర‌తిపాద‌న‌లు రూపొందించామ‌న్నారు.