News

శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం

33views

శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయనగరం దగ్గరలో ఏర్పాటు చేసిన శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. రామాయణంలోని మానవీయ విలువలను భావితరాలకు అందించే సంకల్పంతో కృషి చేసిన శ్రీ నారాయణం నరసింహ మూర్తి గారి సంకల్పానికి ప్రతిరూపంగా ఈ కేంద్రం ఏర్పాటు చేసిన వారి కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. వారికి సహకారం అందిస్తున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా రామాయణ మహసదస్సును నిర్వహించటం ముదావహమన్న ఆయన, ఇక్కడ ఏర్పాటు చేసిన రామాయణ ఘట్టాలను యువతరం సందర్శించి, రామాయణం నుంచి స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు.

ఓ సాధారణ మానవుడిగా ఆదర్శాలతో జీవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు అన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీమద్రామాయణం ఆదికావ్యమే కాక, భారతీయుల్ని ఓ సానుకూల మార్గంలో ముందు నడిపే వ్యక్తిత్వ వికాస గ్రంథం అని తెలిపారు. ప్రతి మానవుడు నేర్చుకోవలసిన అనేక సానుకూల అంశాలు శ్రీరాముని జీవితంలో కనిపిస్తాయన్న ఆయన, మానవ జీవితంలో ప్రతి బంధానికి, బంధుత్వానికి రాముడే ఆదర్శంగా కనిపిస్తాడని పేర్కొన్నారు. రాముని ధర్మ మార్గం కారణంగా యుగయుగాల తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయన్న ఆయన, గుణవంతుడు… వీర్యవంతుడు… ధర్మాత్ముడు… కృతజ్ఞతా భావం కలిగిన వాడు… సత్యాన్ని పలికేవాడు…. ధృడమైన సంకల్పం కలిగిన వాడు… చారిత్రము కలిగిన వాడు… అన్ని ప్రాణుల మంచి కోరేవాడు…. విద్యావంతుడు… సమర్థుడు… ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగిన వాడు… ధైర్యవంతుడు…. క్రోధాన్ని జయించిన వాడు…. తేజస్సు కలిగిన వాడు…. ఎదుటి వారిలో మంచిని చూసేవాడు…. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు అనే 16 గుణాలు రాముణ్ని ఉన్నతంగా నిలిపాయని పేర్కొన్నారు.

ధర్మాన్ని ఆశ్రయించి, స్వార్థాన్ని వదలిపెట్టి, ధార్మికునిగా జీవితాన్ని గడిపిన పరిపూర్ణ మానవుడే శ్రీరాముడన్న వెంకయ్యనాయుడు, ఈ ధార్మిక వర్తనే వాల్మీకిని ఆకర్షించిందని పేర్కొన్నారు. ఈ కారణంగానే దేశంలో ప్రతి ఊరూ శ్రీరాముని ఆలయాలు, భజన మందిరాలతో శోభిల్లుతున్నాయన్న ఆయన, ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా… ఇలా ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపిన వాడు శ్రీరామచంద్రుడు అని పేర్కొన్నారు.