ArticlesNews

భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్

45views

(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి)

అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్‌ ‌భగత్‌సింగ్‌. ‌కిషన్‌సింగ్‌, ‌విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్‌ 27‌వ తేదీన నేటి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ ‌దగ్గరలోని ఖత్కర్‌ ‌కలాన్‌ ‌గ్రామంలో భగత్‌సింగ్‌ ‌జన్మించాడు. భగత్‌సింగ్‌ ‌తాత అర్జున్‌సింగ్‌ ‌సిక్కు మతస్థుడైనా దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ సిద్ధాంతాలను పాటించే వాడు. అందుకే భగత్‌ ‌సింగ్‌ను దయానంద్‌ ఆం‌గ్లో వేదిక్‌ ‌పాఠశాలలో చదివించాడు. భగత్‌సింగ్‌ ‌చిన్నాన్న లైన స్వరణ్‌ ‌సింగ్‌, అజిత్‌ ‌సింగ్‌లు దేశభక్తి పరులు. స్వరణ్‌సింగ్‌ ‌కాకోరీ రైలు దోపిడీలో రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌తో పాటూ పాల్గొన్నందుకు బ్రిటీషువారు ఉరి తీశారు. అజిత్‌సింగ్‌ ‌విదేశాలకు వెళ్లి గదర్‌ ఉద్యమంలో చేరాడు. వీరి ప్రభావం భగత్‌సింగ్‌పై పడింది. ఒకరోజు కిషన్‌సింగ్‌ ‌పొలంలో గోధుమలు నాటుతుండగా ‘ఎందుకు నాటుతున్నావవి నాన్న ?’ అని ప్రశ్నించాడు. ‘ఒక్కొక్క గోధుమ నుంచి ఒక్కొక్క మొక్క పెరిగి మరిన్ని గోధుమలను ఇస్తుంది’ అని వాళ్ళ నాన్న చెప్పాడు. భగత్‌సింగ్‌ ‌పరుగు పరుగున ఇంటికి వెళ్లి బొమ్మ తుపాకి తెచ్చి భూమిలో పాతుతు న్నాడు. అది చూసి ‘ఎందుకు ఇలా చేస్తున్నావు ?’ అని కిషన్‌సింగ్‌ ‌ప్రశ్నించాడు. ‘హర్నాం కౌర్‌ ‌పిన్ని కన్నీటికి కారణమైన ఆ తెల్లవాళ్లను చంపడానికి ఇలాంటి తుపాకులు మరిన్ని కావాలి’ అని భగత్‌సింగ్‌ ‌దేశభక్తికి మురిసిపోయాడు కిషన్‌సింగ్‌. ‌రౌలత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 18, 1919‌న అమృత్‌సర్‌లోని జలియన్‌ ‌వాలాబాగ్‌లో జనరల్‌ ‌డయ్యర్‌ ‌నాయకత్వంలో జరిపిన కాల్పులలో వందలాది మంది ప్రజలు మరణించారు. ఈ సంఘటన భగత్‌సింగ్‌ను ఎంతగానో కదిల్చి వేసింది.

ఉద్యమాల బాట
లాహోర్‌లో లాలా లజపతి రాయ్‌ ‌స్థాపించిన నేషనల్‌ ‌కాలేజీలో బీఏలో చేరాడు. ఆ కాలేజీ లెక్చరర్‌ ‌జయచంద్ర విద్యాలంకార్‌ ‌భగత్‌సింగ్‌ ‌మనసులో విప్లవ బీజాలను నాటాడు. భగవతి చరణ్‌తో కలిసి నౌజవాన్‌ ‌సంఘంలో చేరాడు. లాలా లజపతిరాయ్‌ ‌తన తండ్రి పేరున స్థాపించిన ద్వారకానాథ్‌ ‌లైబ్రరీకి వెళ్లి ఫ్రెంచ్‌ ‌విప్లవాన్ని ప్రభావితం చేసిన రూసో, వోల్టేర్‌ ‌రచనలు, ఇటలీ విప్లవానికి కారణమైన జోసెఫ్‌ ‌మాజినీ, గారిబాల్డి పోరాట మార్గాలను, రష్యా విప్లవానికి నాంది పలికిన కార్ల్‌మార్కస్ ‌రచనలను చదివేవాడు. యశ్‌పాల్‌, ‌సుఖ్‌దేవ్‌లతో కలిసి ఎప్పుడూ విప్లవ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనటం చూసి కిషన్‌సింగ్‌ ‌భగత్‌సింగ్‌కు మంచి పెళ్లి సంబంధం చూశాడు. ‘నాకు ఎప్పుడో పెళ్లై పోయింది నాన్న ! స్వరాజ్య లక్ష్మే నా భార్య !’ అని భగత్‌ ‌సింగ్‌ ‌చెప్పాడు. పెళ్లికోసం ఒత్తిడి తెస్తున్నారని ఒక రోజు ఇంటి నుంచి పారిపోయి రామ్‌‌ప్రసాద్‌ ‌బిస్మిల్‌, అప్పాఖుల్లా ఖాన్‌లు స్థాపించిన హిందూస్థాన్‌ ‌రిపబ్లికన్‌ ఆర్మీలో చేరాడు.

సాండర్స్ ‌హత్య
సైమన్‌ ‌కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్‌ అక్టోబర్‌ 20, 1928‌వ తేదీన లాహోర్‌లో జరిగిన ‘సైమన్‌ ‌గో బ్యాక్‌’ అని నినాదాలు చేశాడు. జనరల్‌ ‌స్కాట్స్ ఆదేశాల మేరకు పోలీసు అధికారి జేపీ సాండర్స్ ‌జరిపిన లాఠీ దెబ్బలకు తట్టుకోలేక లాలా లజపతిరాయ్‌ ‌స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పంజాబ్‌ ‌కేసరి నవంబర్‌ 17 ‌న మరణించడంతో, భగత్‌ ‌సింగ్‌ ‌నెలలోగా ఆ అధికారిని మట్టు పెడతానని ప్రతినబూనాడు. లాహోర్‌లోని రాయ్‌గంజ్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురు, జయగోపాల్‌ అం‌దరూ కలిసి వ్యూహ రచన చేశారు. వారు సైకిల్‌పై వచ్చి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వద్ద కాపు కాచారు. స్కాట్స్ ఎం‌తసేపటికీ బయటకు రాలేదు. అంతలోనే సాండర్స్ ‌బయటకు వచ్చి వీరిని గమనించడంతో భగత్‌ ‌సింగ్‌ ‌తుపాకీతో సాండర్స్ ‌ను కాల్చి చంపాడు. అందరూ పారిపోతూ ఉంటే అది గమనించి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ ‌చానన్‌సింగ్‌ ‌వీరిని అడ్డుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతనిని ఆజాద్‌ ‌తుపాకీతో కాల్చవలసి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి లాహోర్‌ అం‌తా పోలీసులు గాలించారు. పోలీసుల కన్ను గప్పడానికి ఆజాద్‌ ‌సన్యాసిగా, భగత్‌సింగ్‌ ‌సూటు, బూటు, టోపి ధరించి దొరలాగా వేషం మార్చాడు. వదినగా భావించే భగవతి చరణ్‌ ‌భార్య దుర్గావతి దేవిని దొర భార్యగా, రాజ్‌గురును నౌకరుగా వేషం వేయించి లాహోర్‌ ‌నుంచి ఆజాద్‌ ‌తప్పించాడు.

ఢిల్లీ అసెంబ్లీలో బాంబు
బ్రిటీష్‌ ‌వారి అకృత్యాలను ప్రపంచానికి ఏకరువు పెట్టడానికి ఢిల్లీ అసెంబ్లీలో ఏప్రిల్‌ 8, 1929‌న బాంబు వేయాలని ఆజాద్‌, ‌భగత్‌సింగ్‌ ‌బృందం నిర్ణయించారు. అయితే ఇది ఎవరినీ చంపడానికి ఉద్దేశించింది కాదు. బటుకేశ్వర్‌ ‌దత్‌తో కలిసి భగత్‌సింగ్‌ ఎవరూ లేనిచోట బాంబులు విసిరి, పారి పోకుండా అక్కడే ఉండి ఎర్రటి కరపత్రాలు పంచుతూ పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరితో పాటూ సుఖ్‌దేవ్‌ను, రాజ్‌గురులను లాహోర్‌ ‌సెంట్రల్‌ ‌జైల్లో ఉంచారు. జైలులో సరియైన ఆహారం లేనందున భగత్‌సింగ్‌ ‌మిగతా ఖైదీలతో కలిసి నిరాహారదీక్ష చేపట్టాడు. బబ్బర్‌లాంటి కరుడు గట్టిన దొంగ కూడా వీరి నిరాహారదీక్షకు కన్నీరు కార్చాడే కానీ జైలర్‌ ‌మనసు మాత్రం కరగలేదు. పైగా జైలర్‌ ‌నీళ్లు కూడా లేకుండా చేయడంతో జతేంద్రనాధ్‌దాస్‌ అనే ఖైదీ మరణించాడు. ఈ విషయం దావానలంలా పంజాబ్‌ అం‌తటా వ్యాపించింది. చివరికి బ్రిటీష్‌ ‌ప్రభుత్వం తలవంచి జైలులో మంచి ఆహారంతో పాటూ కొన్ని సదుపాయాలు కల్పించారు.

భగత్‌సింగ్‌ని విడిపించడానికి ఆజాద్‌ ‌లాహోర్‌ ‌సెంట్రల్‌ ‌జైలుకు దగ్గరలో అద్దెఇంటిలో చేరాడు. బాంబులు వేసి జైలుగోడలు బద్దలు కొట్టి ఖైదీలను విడిపించాలని పథకం పన్నాడు. మే 28,1930న బాంబును పరీక్షించడానికి భగవతీ చరణ్‌, ‌బచ్చన్‌తో కలిసి దగ్గరిలోని అడవిలోకి వెళ్ళాడు. కానీ ఆ బాంబు పొరపాటున పేలడంతో భగవతి అక్కడికక్కడే మర ణించాడు. పోలీసుల గాలింపు ఎక్కువ కావడంతో ఆజాద్‌ అలహాబాద్‌కు వెళ్లిపోయి, భగత్‌సింగ్‌ను ఎలా విడిపించాలా అని ఎంతో మదనపడ్డాడు. ఫిబ్రవరి 27, 1931న ఆల్‌ ‌ఫ్రెడ్‌ ‌పార్క్‌లో పోలీసులతో వీరోచితంగా పోరాడి చివరకు బ్రిటీష్‌వారి చేతుల్లో చావడం ఇష్టం లేక తన తుపాకీతో తానే కాల్చుకొని ఆజాద్‌ ‌వీర మరణం పొందాడు. మిత్రుడి మరణం భగత్‌సింగ్‌ని మరింత బాధించింది.

కేసు విచారణ
భగత్‌సింగ్‌ను ఉగ్రవాదిగా భావించి సోదాలు నిర్వహిస్తే, బాంబులకు బదులు ఎక్కడ చూసినా పుస్తకాలే కనబడ్డాయి. భగత్‌సింగ్‌ ‌వేసిన బాంబు కూడా పరిశోధించి అది పొగబాంబని తేల్చారు. కానీ సాండర్స్‌ను చంపిన హత్య కేసులో భగత్‌సింగ్‌, ‌సుఖ్‌ ‌దేవ్‌, ‌రాజ్‌గురులకు ఉరిశిక్షను విధించారు. బటుకే శ్వర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు.

భగత్‌సింగ్‌ ‌వీలునామా
మరణ శిక్షను తప్పించడానికి కిషన్‌సింగ్‌ ‌క్షమాపణ పత్రంపై సంతకం చేయమని భగత్‌సింగ్‌కు చెప్పాడు. ‘నాకు క్షమాభిక్ష ప్రసాదించమని బ్రిటిష్‌ ‌వారిని వేడుకోవడం కంటే, చావునే ఆనందంగా స్వీకరిస్తాను. నేనొక ప్రయోజనం కోసం ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నాను’ అని తండ్రితో అన్న గొప్ప క్రాంతికారుడు సర్దార్‌ ‌భగత్‌సింగ్‌. ‌కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లితో బాధ పడవద్దమ్మా ! నేను సంతో షంగా ఉరికంబానికి ఎక్కితే తమ బిడ్డలు నా లాగా వీరపుత్రులు కావాలని తల్లులు కోరుకుంటారు. నా చావు భావితరాలకు ఆదర్శంకావాలి’ అని ఓదా ర్చాడు. ‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవా ల్సిందే, కానీ నీ మరణం పది కాలాలు గుర్తుండి పోతుంది నాయనా!’ అని ఆ తల్లి భగత్‌సింగ్‌ని దీవించింది. ఉరి తీయకూడదని భగత్‌సింగ్‌ ‌తల్లి దండ్రులే కాదు దేశమంతా కోరుకున్నారు. కానీ భగత్‌సింగ్‌ ఉరిశిక్షకు జంకలేదు. ‘నాకూ బ్రతకాలనే ఉంది. నేను ఆవేశంగా ప్రాణాలను పోగొట్టుకోవడం లేదు. వివాహం చేసు కొని పిల్లా పాపలతో కొన్నాళ్లు సుఖంగా బతకవచ్చు. కానీ దానివలన ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు. ఒక మనిషి ప్రాణం కోల్పోవడం వల్ల ఈ జాతికంతా మంచి భవిష్యత్తు ఉందంటే నేను జీవితకాలం బతకడం కన్నా చనిపోవడం చాలా విలువైనదని భావిస్తున్నాను. అందుకనే సగర్వంగా, చిరునవ్వుతో ఉరికంబాన్ని ఎక్కుతున్నాను.’ అని మిత్రులకు జైలు నుంచి ఉత్తరాలు రాశాడు. వీటిని భగత్‌సింగ్‌ ‌భారతజాతికి ఇచ్చిన వీలునామాగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.

తమను ఉరి తీయవద్దని కాల్చి చంపమని జైలు అధికారులను భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులు కోరారు. ఎందుకంటే ఉరితీస్తే ఈ పుణ్యభూమిని వదలి మా పాదాలు గాలిలో ఉంటాయని, అదే కాల్చి చంపితే భరతమాత ఒడిలో చనిపోతామని కోరుకున్న నిజమైన దేశభక్తులు వీరు. దేశమంతా భగత్‌సింగ్‌ ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండ డంతో బ్రిటీష్‌ అధికారులు భయపడ్డారు. ఒకరోజు ముందుగానే అంటే మార్చి 23, 1931వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7.15 నిమిషాలకు ఉరితీశారు. చివరి కోరికగా ఆ ముగ్గురు మిత్రులూ తమ సంకెళ్లను విప్పమని కోరారు. ‘ఈ జన్మలో ఇలా కలిసి ప్రాణ స్నేహితులుగా బ్రతికామని, కలిసి మరణిస్తున్నామని, మరు జన్మ ఉంటుందో లేదో!’ అని చెప్పడంతో కరుడుగట్టిన ఆ జైలర్‌కు కూడా కన్నీరు ఆగలేదు. సంకెళ్లను విప్పగానే ముగ్గురు మిత్రులు గాఢంగా కౌగలించుకుని ఉరితాడును ముద్దాడుతూ ‘ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌!’ అం‌టూ భరతమాత చెంత చేరారు.

షహీద్‌ ‌స్మారక చిహ్నం
ఈ వీరుల మృతదేహాలను చూస్తే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, ఆ బడబాగ్నిని చల్లార్చలేమని భావించిన బ్రిటీష్‌ అధికారులు మృత దేహాలను లేకుండా చేయాలనుకొన్నారు. లాహోర్‌ ‌జైలు వెనుక గోడలను బ్రద్దలు కొట్టి సట్లెజ్‌ ‌నదీ తీరంలోని హుస్సేనీ వాలాలో అంతిమ సంస్కారాలు జరపకుండానే దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా దివిటీలు చేతపట్టి సట్లేజ్‌ ‌నది తీరంలోకి వస్తుండడం చూసి ఆ ధూర్తులు అవశేషాలు కూడా దొరకకూడదని, పూర్తిగా మృతదేహాలను కాల్చకుండానే నదిలో పారవేసి పారిపోయారు. అది చూసిన యువకులు కొందరు నదిలో దూకి, వాటిని సేకరించి అంతిమ సంస్కారాలు చేసి వారి సంస్మరణార్ధం అక్కడే అమర వీరుల స్మారక చిహ్నాన్ని కట్టారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో పాకిస్తాన్‌ ‌సైన్యం దీనిని ధ్వంసం చేసింది. భారత సైన్యం ఈ ప్రాంతాన్ని స్వాధీన పరచుకొన్న తరువాత 1973లో భారత ప్రభుత్వం దీనిని పునర్నిర్మించింది.

‘సర్ఫ్ ‌రోష్‌కి తమన్నా అబ్‌ ‌హమారే దిల్‌ ‌మెహై – దేఖ్‌ ‌న హై జోర్‌ ‌కితనా బాజూవే కాతిల్‌ ‌మెహై’ త్యాగం చేయాలనే విప్లవకాంక్ష మన హృదయాల్లో నిండి ఉంది, మనల్ని అంతం చేయాలనే వాడి బాహు బలం ఏ పాటిదో చూడాలి మరి ! అని పాడుకున్న విప్లవవీరుల త్యాగ ఫలితమే మనం నేడు అను భవిస్తున్న ఈ స్వాతంత్య్రం.

ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌