ArticlesNews

సద్గుణవంతుల శాంతి సందేశం

33views

( సెప్టెంబరు 21 – అంతర్జాతీయ శాంతి దినోత్సవం )

పుట్టుకతో మనమంతా శాంత స్వభావులమే. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, సన్నివేశాలు ఆ సహజ శాంతస్థితి నుంచి ఉద్విగ్నస్థితికి మళ్లిస్తాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఆ ప్రభావం ఎంతటిదంటే.. ఉద్విగ్నతే సహజస్థితి అనిపించేలా అల్లకల్లోలం చేస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషులు తమ సద్గుణసంపదతో శాంతి సందేశాన్ని అందించారు.
మదిలో అలజడులూ ఆందోళనలూ చెలరేగకుండా జీవితం ప్రశాంతంగా సాగాలంటే.. కామ క్రోధాదుల్ని జయించాలి. జయించకపోయినా కనీసం నిగ్రహించాలి. ఈ సంఘర్షణలో కలిగిన ఉద్విగ్నతను నియంత్రించ గలిగితే శాంతి, సుఖం. లేదంటే పతనం, వినాశనం. అదుపు చేసినవారు, చేయనివారు ఇద్దరూ శాంతిని పొందుతారు. కాకపోతే ఒకరు జీవిస్తూనే శాంతి పొందితే ఇంకొకరు జీవితాన్ని ముగించి పొందుతారు. ఇంట్లో దీపం పెట్టడానికి, ఇంటికి నిప్పు పెట్టడానికి ఉన్నంత తేడా ఈ రెండింటికి.

క్రోధం-శాంతి
క్రోధం ద్వారా శాంతిని పోగొట్టుకున్నవాడు అశ్వత్థామ. అదే క్రోధంతో శాంతిని సాధించినవారు భీముడు, ద్రౌపది. అదుపుతప్పిన క్రోధంతో దృష్టద్యుమ్నుని, ఉపపాండవుల్ని అర్ధరాత్రి అన్యాయంగా సంహరించి శాపగ్రస్తుడై జీవితాంతం ప్రశాంతతకు దూరమయ్యాడు అశ్వత్థామ. అగ్నినుంచి పుట్టిన ద్రౌపదిని (ద్రోణాచార్యుని హతమార్చేందుకు ద్రుపదుడు యజ్ఞం నిర్వహించగా.. ఆ అగ్ని నుంచి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు ఉద్భవించారు) అన్యాయంగా అవమానించి భీమునిలో ఆగ్రహావేశాలు కల్పించి తమ చావును తామే కొనితెచ్చుకున్న వాళ్లు దుర్యోధన దుశ్శాసనులు. విపరీతమైన క్రోధావేశం కలిగినప్పటికీ ధర్మానికి కట్టుబడిన భీముడు ఏళ్ల తరబడి వేచిచూసి.. యుద్ధంలో శత్రుసంహారం చేశాడు. బంధువర్గాన్ని సంహరించినా ధర్మరాజులా అశాంతికి లోనవలేదు. కౌరవుల్ని చంపేందుకు పదమూడు సంవత్సరాలు ఆగిన భీముడు కీచకుడి విషయంలో పదమూడు రోజులు కూడా ఆగలేదు. అర్ధరాత్రి అతణ్ణి సంహరించి, ఉదయాన్నే ప్రశాంతంగా వంటచేసిన స్థితప్రజ్ఞుడు, శాంతస్వభావుడు భీముడు. కౌరవులు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు శాంతాన్ని కోల్పోయింది ద్రౌపది. ఐదుగురు బిడ్డల్ని అరాచకంగా కడతేర్చిన గురుపుత్రుడైన అశ్వత్థామ విషయంలో విపరీతమైన గర్భశోకాన్ని అనుభవించింది. కానీ తనకు కలిగిన గర్భశోకం గురుపత్నికి కలగకూడదని శాంతంగా, నిబ్బరంగా ఉంది.

మోహం-శాంతి
పుత్ర వ్యామోహంతో ప్రశాంతతను కోల్పోయినవారు ధృతరాష్ట్రుడు, దశరథుడు. బిడ్డల పట్ల ఇద్దరికీ హద్దు మీరిన వ్యామోహం. ఒకరిది ధర్మబద్ధమైంది, ఇంకొకరిది అధర్మంతో కూడినది. రాముడిపట్ల ఉన్న వ్యామోహం వల్ల అధర్మానికి లోనుకావాల్సిన పరిస్థితులు ఏర్పడి, ప్రశాంతత కరువైనప్పుడు దశరథుడు ప్రాణాన్ని విడిచాడే గానీ అధర్మంగా ప్రవర్తించలేదు. కానీ ధృతరాష్ట్రుడు బిడ్డలపై వ్యామోహంతో సర్వధర్మాలనూ తుంగలో తొక్కి జీవితాంతం అశాంతిగానే గడిపి, దిక్కులేని అనాథలా మంటల్లో కాలి బూడిదయ్యాడు.

కామం-శాంతి
అపరిమిత అధికారం, అత్యున్నత తపస్సంపద, అమిత పరాక్రమం, అంతఃపుర సౌఖ్యం.. అన్నీ ఉన్నా రావణుడు ప్రశాంత జీవనాన్ని సాగించలేకపోయాడు. తపస్సంపద లేకపోయినా మిగిలిన మూడూ ఉన్నవాడు కీచకుడు. ఇద్దరూ కూడా అన్యకాంతల పట్ల కామోద్విగ్నతకు లోనై శాంతిని కోల్పోయారు, మరణంతో శాంతి పొందారు.

లోభం-శాంతి
తనకు కావలసినంత ఉన్నప్పటికీ తనదికాని రాజ్యాన్ని తనది చేసుకోవాలన్న లోభంతో శాంతిని కోల్పోయినవారు దుర్యోధనుడు, కైకేయి. ధర్మం ప్రకారం తనకు అర్హత లేకపోయినా రాజ్యాన్ని పొందడమే కాక ఎదుటివారి రాజ్యాన్ని కూడా ఆశించాడు దుర్యోధనుడు. చెప్పుడు మాటలు విని అనర్హుడైన తనబిడ్డకు రాజ్యాన్ని కట్టబెట్టాలనుకుంది కైకేయి. ఇద్దరూ లోభానికి లోనైనప్పటికీ.. దుర్యోధనుడుమూర్ఖత్వంతోమరణాన్ని కొనితెచ్చుకున్నాడు. వివేకంతో తన లోభాన్ని పోగొట్టుకొని శాంతస్థితికి చేరింది కైకేయి.

మదం-శాంతి
శిశుపాలుడు, గజేంద్రుడు.. ఇద్దరూ ప్రశాంతతకు దూరమయ్యారు. తన మదంతో లోకాన్ని కల్లోలపరిచాడు గజేంద్రుడు. మొసలిపట్టుతో తనది అనుకున్న బలం తగ్గి, తనవారు అనుకున్న బలగం విడిచిపోతే.. ఆర్తితో భగవంతుణ్ణి ఆశ్రయించి జ్ఞానంతో శాంతస్థితిని అందుకున్నాడు గజేంద్రుడు. భగవంతుని పరివారంలో జన్మించి, అయాచితంగా వంద వరాల్ని పొంది కూడా.. సద్వినియోగపరచుకోలేక మదంతో ప్రాణాల్ని కోల్పోయాడు శిశుపాలుడు. పశువుగా జన్మించి జ్ఞానంతో ప్రశాంతస్థితికి చేరుకున్నవాడు గజేంద్రుడు, జ్ఞానిలా జన్మించి పశుప్రవృత్తితో ప్రశాంతతను కోల్పోయినవాడు శిశుపాలుడు.

ద్వేషం-శాంతం
కామ క్రోధాదులను జయించినవాడు రుషి. అంతకంటే గొప్పవారు రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. సాక్షాత్తూ దైవ స్వరూపమైన నారదుడు కూడా ద్వేష భావనతో ప్రశాంత చిత్తాన్ని కోల్పోయాడు. తోటివాడైన తుంబురుని గానం పట్ల మాత్సర్యం పెంచుకుని శుద్ధ శాంతమయమైన అంతరంగాన్ని కలతపరచుకున్నాడు. అయితే సహజ జ్ఞాన సంపన్నుడు కాబట్టి ద్వేషాన్ని స్పర్ధగా మలుచుకొని సంగీత జ్ఞాన సంపాదనతో శాంతి పొందాడు. తోడికోడలి కడుపుపంటను చూసి అసూయతో కడుపుమంటను పెంచుకుని ప్రశాంతత కోల్పోయి.. తన గర్భస్థ పిండాన్ని తానే నేలరాల్చుకుంది గాంధారి. తర్వాత కొంత తేరుకున్నప్పటికీ, మాత్సర్య భావన ద్వారా పుట్టిన కొడుకు అదే గుణాన్ని అలవరచుకుని గాంధారికి జీవితంలో శాంతమనేది లేకుండా చేశాడు.

సముద్రంలో ఆటుపోట్లలా ఏ భావోద్వేగాలు ఆటంకపరిచినా తొణకకుండా ప్రశాంతంగా జీవించిన మహాపురుషులూ ఉన్నారు. రాత్రి పట్టాభిషేకం అని చెప్పి ఉదయాన్నే వనవాసం వెళ్లమన్నా.. అణువంత మనోచాంచల్యాన్ని పొందని ప్రశాంతచిత్తుడు శ్రీరాముడు. హస్తినలో ఉన్నా అరణ్యంలో ఉన్నా సమచిత్తంతో మెలిగినవాడు ధర్మరాజు. సీతాపహరణ, లక్ష్మణ మూర్ఛ సమయాల్లో శ్రీరాముడు; కురుక్షేత్ర యుద్ధానంతరం బంధువధ విషయంలో ధర్మరాజు కొంత చలించినట్లు కనిపించినా తమ సహజ శాంతస్థితిని తిరిగి పొందారు. జీవితమంతా ఆటుపోట్లతో నిండినా ప్రశాంతంగా జీవించటానికి కృషి చేశారు భీష్ముడు, విదురుడు. ‘తన శాంతమే తనకు రక్ష’ అన్న భావానికి ప్రతిరూపాలు వీరు.

తాను పుట్టకముందే తనకోసం మృత్యువు ఎదురుచూస్తున్నా, పుట్టీపుట్టగానే తల్లిదండ్రులకు దూరమైనా, జీవితంలో అడుగడుగునా ఆటంకాల్ని ఎదుర్కొన్నా.. అన్నింటిలో తానుంటూ, ఏ ఒక్కటీ తనకు అంటకుండా కర్మను లీలగా మలుచుకున్నాడు శ్రీకృష్ణుడు. రాజసూయ యాగంలో అగ్ర పూజ అందుకున్నా, నిర్వంశం అయిపోతుందని గాంధారి తనను శపించినా, కర్మఫలాన్ని అనుభవిస్తూ తన వాళ్లందరూ తన ముందే చనిపోతున్నా, హాయిగా మురళి వాయిస్తూ అణువంతైనా చలించనివాడు, పాము మీద పడుకున్నా ప్రశాంతతను కోల్పోనివాడు, శాంతాకారుడు, భుజగశయనుడు శ్రీకృష్ణుడు. ఆ నల్లనయ్యను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదురయ్యే ఆటంకాలూ, ఆవేదనలూ.. అన్నీ కర్మఫలాలేనని గ్రహించి, ఉద్వేగాలకు లోనవకుండా సాగితే.. అంతా శాంతిమయమే.