ArticlesNews

సంజౌలి సమరం

37views

మొత్తానికి సంజౌలి (హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాజధాని సిమ్లా)లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ హిందువులు ఆరంభించిన పోరాటం ఫలించినట్టే కనిపిస్తున్నది. ఇందుకు మొదటి చర్య- మసీదు అక్రమ నిర్మాణమేనని వక్ఫ్‌బోర్డు సెప్టెంబర్‌ 8‌వ తేదీ శుక్రవారం ప్రకటించింది. మొత్తం మసీదును తన అధీనంలోకి తీసుకుంది. ఇమామ్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించినట్టు సిమ్లా వక్ఫ్ ‌బోర్డు అధికారి కుతుబుద్దీన్‌ ‌చెప్పారు. మసీదును అక్రమంగా నిర్మించారంటూ భారతీయ జనతా పార్టీ, ఇతర హిందూ సంఘాలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసినదే. వీరితో పాటు ఆందోళనలో పాల్గొన్న స్థానికులు నాలుగు అంతస్తుల ఈ మసీదును కూల్చేయాలని పట్టు పట్టారు. సెప్టెంబర్‌ 4‌వ తేదీన హిమాచల్‌ అసెంబ్లీలో ఇదే అంశం మీద జరిగిన మాటల యుద్ధం మసీదు వ్యతిరేక ఆందోళనను తీవ్రం చేసింది. వక్ఫ్ ‌బోర్డు నిర్వాకాల మీద కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదన్న వాస్తవం, ముస్లింలను ఆ విషయంలో గంపగుత్తగా సమర్థించే విధానం కాంగ్రెస్‌ ‌పార్టీలో లేవని దీనితో దేశానికి అర్దమైంది. సంజౌలీ మసీదు వ్యతిరేక నిరసన పెద్ద ఎత్తున జరిగిందనే మీడియా నమోదు చేసింది. వేల సంఖ్యలోనే హిందువులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దిగి వచ్చిందని అనాలి.

కానీ వాస్తవాలు వెల్లడించినందుకు, ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిరుధ్‌ ‌సింగ్‌కు మాత్రం సొంత పార్టీ నుంచే నిరసన సెగ తలిగింది. ఆయన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో సభ్యునిగా కాకుండా, బీజేపీ సభ్యుడిలా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు రావడం విశేషం. ముస్లింలు, వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్వాకాలుచేసినా నోరెత్తకూడదన్నదే కాంగ్రెస్‌ ‌సిద్ధాంతం అనుకోవలసిన వాతావరణమే హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కనిపిస్తున్నదంటే కొట్టిపారేయడం కష్టమే.

సంజౌలీ మసీదు దగ్గర అంతా ప్రశాంతంగానే ఉందని, మసీదు 1960కి ముందే నిర్మించారని, మూడు అంతస్తులు 2010లో అదనంగా నిర్మించారని హరీశ్‌ ‌జనర్తా వాదించాడు. స్థానికులు మాత్రమే కాదని, బయటి నుంచి వచ్చిన ముస్లింలు కూడా అందులో ఉంటున్నారని, అక్రమంగా నిర్మించిన మరుగుదొడ్లను ఇదివరకే కూల్చేశారని హరీశ్‌ ‌చెప్పారు. అందులో ఉన్న ముస్లిం తెహబజరీలు 190 మంది కాదని, 1900 అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిరుధ్‌ ‌సింగ్‌ ‌బదులిచ్చారు. ముస్లిం తెహబజరీలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే హాకర్లు. కానీ నిబంధనల మేరకు హాకర్లుగా స్థానికులకే లైసెన్సు ఇవ్వాలని, అందుకే బయటి నుంచి వచ్చిన వారికి లైసెన్సులు రద్దుచేస్తున్నామని కూడా మంత్రి తెలియచేశారు. తరువాత సీఎన్‌ఎన్‌ ‌న్యూస్‌ 18 ‌చానల్‌తో మాట్లాడిన అనిరుధ్‌ ‌సింగ్‌ అ‌క్రమ కట్టడాలను కూల్చివేస్తామనే చెప్పారు. హిమాచల్‌లో ఉన్నది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. ఇది ఇద్దరు కాంగ్రెస్‌ ‌నాయకుల ఘర్షణగా గమనించాలి. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలకీ, వక్ఫ్ ‌బోర్డు ఇస్తున్న సమాచారానికీ పొంతన లేదు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు నిర్మించిన అనేక కట్టడాలను ఇప్పటికే కూల్చేశామని, బయటి వ్యక్తుల ప్రవేశం మీద నిషేధం ఉన్నందున ఈ చర్య తీసుకున్నామని బోర్డు ప్రకటించింది. బయటివారు మసీదులో ఉండడానికి కూడా అనుమతించడం లేదని చెప్పింది.

15 రోజులలో మసీదు కూల్చివేయాలని నినదిస్తూ సెప్టెంబర్‌ 5‌న పలు హిందూ హక్కుల సంఘాలు, స్థానికులు విధాన సభ దగ్గర ఉన్న చౌరా మైదానంలో ఆందోళనకు దిగారు. హిందూ జాగరణ్‌ ‌మంచ్‌, ‌దేవభూమి క్షత్రియ సంఘటన ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కేవలం అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయడం ఒక్కటే కాదని, వక్ఫ్ ‌బోర్డును రద్దు చేయాలని కూడా కోరుతున్నామని హిందూ జాగరణ్‌ ‌మంచ్‌ ‌రాష్ట్రశాఖ అధ్యక్షుడు కమల్‌ ‌గౌతమ్‌ ‌మీడియాకు చెప్పారు. వక్ఫ్‌బోర్డు ఆక్రమించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారని దేవభూమి క్షత్రియ సంఘటన్‌ అధ్యక్షుడు రుమిత్‌సింగ్‌ ‌ఠాకూర్‌ ‌చెప్పారు. రాష్ట్రానికి బయటివారు గుంపులుగా వచ్చి పడుతున్నారని ఆయన ఆరో పించారు. వీరంతా ఎవరో, వీళ్లు చేసే వ్యాపారాలు ఏమిటో ప్రభుత్వం తనిఖీ చేయాలని సూచించారు. సనాతనీల ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. గతంలో నిర్మించిన మొదటి అంతస్తు, పదేళ్ల క్రితం నిర్మించిన మూడు అంతస్తులు కూడా అక్రమమేనని, అక్రమంగా నిర్మించిన ఏ కట్టడమైనా కూల్చి తీరాలని, కానీ పదేళ్లుగా జాప్యం చేశారని మసీదు వ్యతిరేక ఆందోళనలో పాల్గొంటున్న బీజేపీ నాయకుడు అంకుశ్‌ ‌చౌహాన్‌ ‌విమర్శించారు.

నిజానికి సంజౌలీ మసీదు కేంద్ర బిందువుగా మొదలైన ఆందోళనకు ఆగస్ట్ 30‌న బీజం పడింది. మల్యానా ప్రాంతంలో ఒక వ్యాపారి మీద దాడి జరిగింది. ఈ దాడి ముస్లింలే చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మైనర్లు సహా, ఆరుగురు మీద పోలీసులు కేసు నమోదు చేశారు కూడా. దీనితోనే సెప్టెంబర్‌ 1 ‌నుంచి సంజౌలీ మసీదు ముందు హిందువులు ఆందోళన ఆరంభించారు. బయటి నుంచి వచ్చిన చిరు వ్యాపారులకు ఈ మసీదే కేంద్రంగా ఉందన్న సంగతి వక్ఫ్‌బోర్డ్ ‌ప్రకటనతో అర్ధమయింది. మల్యానా దాడిని హత్యాయత్నం కేసుగా పరిగణించాలని కూడా నిరసనకారులు కోరారు. ఏ వర్గాన్ని ఇబ్బందులకు గురి చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, రాజకీయ పార్టీలు నిరసనలు చేసినా, రాజకీయ కార్యకర్తలకు వాతావరణాన్ని కల్లోలం చేసే హక్కు లేదని, సంజౌలీ ప్రాంతం వారితో తమ మంత్రి, ఎమ్మెల్యే చర్చలు జరుపుతున్నారని హిమాచల్‌ ‌ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ ‌సుఖు సన్నాయి నొక్కులు నొక్కారు. ఏమైనా ఒక కుట్రతో రాష్ట్రంలో ప్రవేశించిన వారిని నిరోధించే ఆలోచన ఆయన మాటలలో వినిపించడం లేదు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరు కోరుకున్న చోట వారు ఉండవచ్చునని అన్నారాయన.

ఈ పరిణామాలు చూసి, మసీదు కూల్చివేత ప్రకటనలు విని విస్తుపోతున్నారు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ. ఆయన ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ ‌ప్రకారం హిమాచల్‌ను పాలిస్తున్నది బీజేపీయా? కాంగ్రెస్‌ ‌పార్టీయా? అని ఆయన అయోమయంలో కూడా పడిపోయారు. కాంగ్రెస్‌ ‌చెప్పే ప్రేమ దుకాణం హిమాచల్‌ ‌లేదేమని ఆయన ఆక్రోశిస్తున్నాడు. అయితే కాంగ్రెస్‌ ‌మార్కు ప్రేమ దుకాణం అంటే ఏమిటో ఒవైసీ చెప్పక చెప్పారు. బయటి నుంచి వచ్చి పడిన వారు స్థానికులను చావగొట్టినా ప్రభుత్వాలు మాట్లాడకూడదు. ఎలాంటి అనుమతులు లేకున్నా మసీదుకి అంతస్తులకి అంతస్తులు కట్టినా నోరెత్తకూడదు. మసీదును అక్రమ కట్టడం అన్నారు కాబట్టే ఆ రాష్ట్ర మంత్రి (అనిరుధ్‌సింగ్‌) ‌బీజేపీ భాష మాట్లాడుతున్నాడని గుండెలుబాదుకున్నాడు ఒవైసీ. మసీదును ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మాట సత్యమని మంత్రి అన్నారు. ఆ అంశం 14 ఏళ్లుగా కోర్టు పరిధిలో ఉందని కూడా చెప్పారాయన. ప్రజా పనుల మంత్రి విక్రమాదిత్య సింగ్‌ ‌కూడా అక్రమ ఆక్రమణలను తొలగించడంలో జాప్యం ఉండదని చెప్పారు. అనిరుధ్‌ ‌సింగ్‌, ‌విక్రమాదిత్య సింగ్‌ ‌కలసి సంజౌలీ ప్రాంతాన్ని చూసి అక్కడి పరిస్థితిని అంచనా వేశారు కూడా.

అసదుద్దీన్‌ ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదు. అనిరుధ్‌సింగ్‌ ‌మాటలకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారని వార్తలు రావడమే అతి పెద్ద వింత. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్నారు కాబట్టి, రాహుల్‌ ‌గాంధీ అనుయాయులు కాబట్టి ఆ మాత్రం ముస్లిం ప్రేమను ఒలకబోయక తప్పదు. అనిరుధ్‌ ‌సింగ్‌ ‌మాటలతో అపచారం జరిగి పోయినట్టు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు. ఈ మసీదు ప్రారంభోత్సవానికి ముందు అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా అంటూ సోదర సమర్థుకులని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ‌మంత్రి. ఇది పెద్ద వింతేమరి! అక్కడితో ఆగలేదు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే మసీదు నిర్మాణం ఆరంభించారనీ, ఇది చట్ట విరుద్ధమనీ, మొదట ఒక అంతస్తు, తరువాత నాలుగు కట్టేశారనీ ఆయన చెప్పారు. పైగా, ‘వాళ్లకి’ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడం అలవాటుగా మారిపోయిందని, నాలుగు అంతస్తుల ఈ మసీదునిర్మాణం వ్యవహారం మొత్తం మీద దర్యాప్తు జరగాలని మంత్రి వ్యాఖ్యానించారు. సంజౌలీ మార్కెట్‌ ‌ప్రాంతంలో దొంగతనాలు సర్వ సాధారణంగా మారాయని, స్థానికులు లవ్‌ ‌జిహాద్‌ ‌మీద ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారని మంత్రి కుండబద్దలుకొట్టారు. అందుకే ఎమ్మెల్యే హరీశ్‌ ‌జనార్త కంగారుపడి మంత్రి మాటలను ఆపడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తున్నది. హరీశ్‌ ‌జనార్త, బీజేపీ ఎమ్మెల్యే బల్వీర్‌ ‌వర్మ కలసే ఈ అంశాన్ని ఆరోజు సభలో లేవనెత్తారు.

అసలు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉంటే వక్ఫ్‌బోర్డుకు కావలసినంత స్వేచ్ఛ దొరుకుతుందని, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడానికి ఆ పార్టీ ప్రభుత్వాలే స్ఛేచ్ఛను ఇస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్‌ ‌కింగ్‌ ‌విమర్శించారు. ఈ విషయాన్ని వక్ఫ్ ‌బోర్డు ఆస్తులు పెరిగిన తీరును మంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో వివరించినప్పుడే అర్ధమయిందని ఆయన అన్నారు. వక్ఫ్‌బోర్డు అడ్డంగా వాదించడం వల్లనే చాలా చోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ‌మేధావి జైరామ్‌ ‌రమేశ్‌ ‌జాతి నివ్వెరపోయే విషయం చెప్పారు. సంజౌలీ వివాదాన్ని మత అంశంగా చూడకూడదట. అక్రమ కట్టడం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి చర్యలు చాలునట.

అక్టోబర్‌ 5‌న ఈ వివాదంమీద కోర్టులో విచారణ ఉంది. ఇంతకీ అక్రమంగా నిర్మించిన మసీదును కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూలుస్తుందా? లేకపోతే అనిరుధ్‌ ‌సింగ్‌ను ప్రభుత్వం నుంచి సాగనంపుతుందా? వేచి చూద్దాం.