News

అమ్మజాతరకు అంకురార్పణ

54views

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర పందిరిరాట మహోత్సవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నెలరోజులకు పైగా సాగే ఉత్సవాలకు వేద పండితులు రాటవేసి అంకురార్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు నేత్రత్వంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఆలయమంతా దీక్షాపరులు, భక్తులతో కిటకిటలాడింది. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వేదాశీస్సులు అందజేశారు. ఉదయం 8 గంటలకు పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను భక్తులు తీసుకున్నారు. దీక్షాపరులందరికీ ఉచిత రీతిన దీక్షావస్త్రాలు, మాలలను ఈఓ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ముహూర్తం ప్రకారం చదురుగుడి వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణలతో పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవానికి పందిరిరాట వేసి అంకురార్పణ చేశారు. అనంతరం 11 గంటల ప్రాంతంలో వనంగుడి వద్ద పందిరిరాట వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ చల్లనితల్లి దీవెనలు అందరిపైనా ఉండాలన్నారు. అమ్మవారి జాతర మహోత్సవానికి ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అక్టోబర్‌ 14న తొలేళ్ల సంబరాలు
పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 14న తొలేళ్ల ఉత్సవం, 15న సిరిమాను ఉత్సవాన్ని, 22న మంగళవారం తెప్పోత్సవం, 27న కలశ జ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాల కంబాల మహోత్సవం, 30న చండీహోమంతో జాతర పరిసమాప్తమవుతుందని ఆలయ ఈఓ ప్రసాదరావు తెలిపారు.