News

జ్ఞాన‘జ్యోతి’

53views

విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇంటిపేరుకు తగ్గట్టే ఆయన నిత్యం ప్రకాశించే ‘జ్యోతి’. చారిత్రక, పురావస్తు పరిశోధకుడిగా కీర్తి గడించిన ఈయన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు అనే కుగ్రామంలో జన్మించారు. తెలుగు ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి 24 ఏళ్లపాటు పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడిగా మారారు. ప్రస్తుతం అద్దంకి రామనగర్‌లో నివాసం ఉంటున్నారు. రచయితగానూ గుర్తింపు సాధించారు. అనేక ప్రాంతాల్లో పర్యటించి పురాతన గ్రంథాలు, వస్తువులు గుర్తించి అధ్యయనం చేశారు. ఆలయాల్లో, తవ్వకాల్లో లభించిన శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించి లిపిని అర్థం చేసుకుని కొత్త ప్రతులను తయారు చేశారు. తాళపత్ర గ్రంథాలను సేకరించి పుస్తక రూపం ఇచ్చారు. కొత్త విషయాలు తెలిస్తే పురావస్తు శాఖకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికి ఈయన 30 శాసనాలను, ఏడు బౌద్ధ స్థూపాలను గుర్తించారు. పది తాళపత్ర గ్రంథాలకు పుస్తక రూపం ఇచ్చారు. జానపద కళలకు జీవం పోసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జానపద కళాపీఠం ప్రధాన కార్యదర్శిగా, ప్రకాశం జిల్లా పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ లైఫ్‌ మెంబర్‌గా, ఏపీ గ్రాఫికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా మెంబర్‌గా, మైసూరు ఆలిండియా ఖీయో బౌద్ధ అర్గనైజేషన్‌ కార్యవర్గసభ్యుడిగా, ధర్మచక్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

చంద్రమౌళి రచనలు
అద్దంకి చరిత్ర, సృజన, సూక్తి కిరణాలు, స్ఫూర్తి రత్నాలు, నేటి భారతం, ప్రకాశం జిల్లా చరిత్ర, దళిత కిరణాలు, జానపద కళలు, మాండుకేశ్వర చరిత్ర, ప్రకాశం జిల్లాలో దర్శనీయ స్థలాలు, అద్దంకి సీమ చరిత్ర, తెలుగు నిఘంటువుతోపాటు 26 గ్రంథాలను రచించారు.

పొందిన అవార్డులెన్నో..
చంద్రమౌళి గతంలో జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. అధికార భాషా సంఘ ప్రతిభా పురస్కారం, ఉత్తమ రచయితగా, ఉత్తమ పరిశోధకునిగా, రెండు సార్లు ప్రకాశం జిల్లా విశిష్ట వ్యక్తిగా గౌరవాలను స్వీకరించారు. మద్రాసులోని ఆంధ్ర కళాసమితి ఉగాది సత్కారం, భారతీయుడు, పరిశోధనా భాస్కర, మద్రాసులోని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి వారిచే చారిత్రక పరిశోధనా రత్న, జానపద కళానిధి వంటి ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నారు.