ArticlesNews

బంగ్లాదేశ్ హిందువుల కోసం రచయితల ఓపెన్ లెటర్

39views

కనీవినీ ఎరుగని దాడులతో ఉక్కిరిబిక్కిరై, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, నిద్రలేని రాత్రులను గడుపుతున్న బంగ్లాదేశ్ హిందువుల దుస్థితిని చూసి ప్రపంచం యావత్తూ తీవ్ర వేదనతో స్పందిస్తోంది. కొద్ది గంటల వ్యవధిలో హిందువులే లక్ష్యంగా చోటు చేసుకున్న హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఆస్తుల ధ్వంసం పరిణామాలను చూసి, ఇందుకు కారకులైన ఇస్లామిక్ ఛాందసవాదులను అంతా నిలదీస్తున్నారు. ఈ మారణ కాండను ప్రశ్నిస్తూ భారత్‌లోని పలువురు రచయితలు, విద్యావేత్తలు బహిరంగ లేఖతో ముందుకు వచ్చారు.

బంగ్లాదేశ్ హిందూ సమాజంపై జరిగిన ఘోరకృత్యాలు తమను ఎంతో కలవరపరిచాయని, హిందువులు లక్ష్యంగా పునరావృతమైన ఈ దారుణాలు యావత్ ప్రపంచాన్నీ కదిలించాయని రచయితలు, విద్యావేత్తలు తమ బహిరంగ లేఖలో ఆవేదన చెందారు. బంగ్లాదేశ్‌లోని మెహెర్‌పూర్ ఇస్కాన్ దేవాలయం సహా ఆ దేశంలోని మరెన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ, హిందువులను చంపుతూ విధ్వంసకారులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాల వీడియోలు తమ దృష్టికి కూడా వచ్చాయంటూ ఇందుకు సంబంధించిన మీడియా లింకులను కూడా తమ ఓపెన్ లెటర్‌లో పొందుపరిచారు.

బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ మారణకాండ నేపథ్యం లేనిదేమీ కాదన్న విద్యావేత్తలు, రచయితలు… హిందువులు లక్ష్యంగా ఇలాంటి నరమేధం ఆ దేశంలో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్నప్పుడల్లా జరుగుతూనే ఉందని, బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు 1971 నుంచీ పాకిస్తాన్ పాలనలో 2.5 మిలియన్ల మంది హిందువులు హత్యకు గురై సంగతి అందరికీ తెలుసన్నారు. 2013 నుంచి గమనిస్తే హిందువులపై 3,600 దాడులు జరిగాయని, వ్యవస్థీకృతంగా ఇవి జరుగుతున్నాయని ఈ లేఖలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మీడియా నివేదిక లింకును కూడా బయటపెట్టారు.

బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిణామాలు అక్కడి పరిస్థితిని మరింత అస్థిరపరిచాయని, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయని ఈ ఓపెన్ లెటర్ కుండబద్ధలుకొట్టింది. గత దశాబ్దాలలో బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున సాగిన హిందువుల విషాదకరమైన వలసల జ్ఞాపకాలకు ఇవన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయంటూ… పదే పదే జరుగుతున్న ఈ మారణకాండపై వెంటనే దృష్టిసారించాలని తమ లేఖలో విద్యావేత్తలు, రచయితలు సూచించారు.

బంగ్లాదేశ్ పరిణామాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో ఈ అంశంపై దృష్టి సారించేలా ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని ఈ లేఖలో వారు ఆకాంక్షించారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న హింసాకాండను గుర్తించి, మతపరమైన ఈ హింసను ఖండిస్తూ భారత పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం చెయ్యాలని కోరారు.

ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలసి, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనార్టీల రక్షణతో పాటుగా దోషులను బాధ్యులను చేసే దిశగా బంగ్లాదేశ్ అధికార వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావాలని రచయితలు, విద్యావేత్తలు సూచించారు.

మతపరమైన పీడ కారణంగా బంగ్లాదేశ్‌ని వీడుతున్న హిందువులకు మానవతాపరమైన సహాయం, ఆశ్రయం కల్పించే అవకాశాల దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ లేఖను విడుదల చేసినవారిలో సుప్రీం కోర్టు న్యాయవాది జె.సాయిదీపక్, అమిష్ త్రిపాఠి, అశ్విన్ సంఘీ, అభిషేక్ బెనర్జీ, రాజీవ్ మంత్రి, స్మితా బరూవా తదితర రచయితలు, విద్యావేత్తలు ఉన్నారు.