ArticlesNews

తెలుగు తేజం…కీర్తి ‘పతాకం’ పింగళి వెంకయ్య

64views

( ఆగస్టు 02 – పింగళి వెంకయ్య జయంతి )

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వన్నెల జెండా ఒక్క తాటి పైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సౌర్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే. ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య.

ప్రస్తుత మన జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటికి తెచ్చిన ఈ జెండా 1921లో ప్రాణం పోసుకుంది. అప్పటి వరకు పలువురు నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ, పింగళి రూపొందించిన పతాకమే జాతీయ ఉద్యమానికి దిక్సూచి అయ్యింది. నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది.

ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యకు 1906లోనే కలిగింది. దీనికి కారణం కోల్‌కతాలో 1906లో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో బ్రిటీష్ వారి పతాకమైన యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడం పింగళి వెంకయ్యను కలత పరిచింది. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేక జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనస్సులో మెదిలింది. ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే అంశాన్ని తన అభిమాన విషయంగా పెట్టుకొని దేశంలో ప్రచారం ప్రారంభించారు. అలా 1913 నుంచి జాతీయ నాయకులతో పతాక రూపకల్పన పై చర్చలు జరుపుతూ వచ్చిన వెంకయ్య 1916లో ‘భారత దేశానికి ఓ జాతీయ పతాకం’ అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు.

బెజవాడ వేదికగా 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ సూచనలతో వెంకయ్య కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు మధ్యన రాట్నంతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి ఓ తీర్మానం చేస్తూ రాట్నం స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. జాతీయ పతాకంలోని కాషాయం దేశం పట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే, తెలుపు స్వచ్ఛతని, శాంతిని చాటుతుంది. ఆకుపచ్చ రంగు విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటల్ని, సంపదని సూచిస్తుంది. మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయితీకి ప్రతీకగా నిలుస్తుంది.

దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసే జెండాను రూపొందించిన వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 02న హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులైన వెంకయ్య జర్మనీలో పీహెచ్‌డీ చేశారు. గనులు, వజ్రాల శాస్త్రంలో నిపుణులైన ఆయన ఆధునిక వ్యవసాయం పై పరిశోధనలు చేస్తుండేవారు. 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్న వెంకయ్య దేశానికి స్వాతంత్ర్యం తేవాలన్న కాంక్షతో ఆ దిశగా ఎంతో కృషి చేశారు. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తూ వారిని ఆధునిక సాగు వైపు నడిపించి పత్తి వెంకయ్యగా వాసికెక్కారు. స్వాతంత్ర్యానంతరం వెంకయ్య ఏనాడూ, ఏ పదవిని అశించలేదు. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల మధ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం సత్యం, అహింసలను ఆచరించడంలో సుభిక్షంగా ఉండాలనేదే వెంకయ్య ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. ఆగస్టు 02 ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం. వెంకయ్య స్ఫూర్తితో మనలో జాతీయభావాలను పెంపొందించుకుందాం.