మథుర శ్రీకష్ణ జన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ దాఖలైన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. హిందూ సంస్థల పిటిషన్లను కొట్టేయాలన్న ముస్లిం సంస్థల పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడించింది. షాహీ ఈద్గా మసీదులో పూజలకు అనుమతించాలని హిందూ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. మసీదు లోని రెండున్నర ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికే చెందుతుందని వాదించాయి. మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని కూడా పిటిషన్‌లో వెల్లడించారు. జూన్ 6న విచారణ అనంతరం, ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
శ్రీకృష్ణ జన్మభూమి కేసులో దేవస్థానం తరఫు న్యాయవాది సౌరభ్ తివారీ భారీ విజయం సాధించిందన్నారు. అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ CPC ఆర్డర్ 7, రూల్-11 ప్రకారం షాహి ఈద్గా మసీదు ట్రస్ట్ దరఖాస్తును తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టులో మెయింటెనబిలిటీకి సంబంధించి గత 4 నెలల వివరణాత్మక విచారణ తర్వాత, మొత్తం 18 కేసులను విచారించవచ్చని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసులో విచారణ జరగనుంది. ఆగస్టు 12 నుంచి కేసు విచారణ ప్రారంభం కానుంది.
మే 31, 2024న వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది, అయితే మసీదు తరఫు న్యాయవాది మహమూద్ ప్రాచా వాదనలు వినిపించే హక్కును కోరారు. దీనిని అంగీకరిస్తూ జూన్ 6న కూడా కేసు విచారణకు వచ్చింది. మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్‌తో సహా 18 పార్టీలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. మే 26, 2023న, హైకోర్టు స్వయంగా ఈ కేసులను మధుర జిల్లా కోర్టు నుండి పిలిచి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని ఆదేశించింది. దీనిపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీని తర్వాత, అలహాబాద్ హైకోర్టులో మొదటి విచారణ 2023 అక్టోబర్ 18న జరిగింది.