News

బారా షాహీద్ దర్గాకు రూ.5 కోట్లు

71views

నెల్లూరు బారాషాహీద్ దర్గా అభివృద్ధికి రూ.5 కోట్ల గ్రాంట్‌ను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. అంతేకాదు, నెల్లూరు రొట్టెల పండుగను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామన్నారు. బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెలు మార్చుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరతాయని, కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారని సీఎం చెప్పారు. కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా రొట్టెలు మార్చుకుని తమ కోర్కెలు నెరవేర్చుకుంటారని అన్నారు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అలాగే రాష్ట్రం అప్పుల్లో ఉందని సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని, ఖజానా నిండాలని అందుకు 6 రొట్టెలు వదలమని ఈ సందర్భంగా భక్తులను చంద్రబాబు కోరారు.

బారా షాహీద్ చరిత్ర విషయానికొస్తే, టర్కీకి చెందిన 12 మంది ముస్లిం మత ఛాందసవాదులు తమ మతాన్ని వ్యాప్తి చేసుకుంటూ నెల్లూరులోని గండవరానికి చేరుకున్నారు. ఇక్కడ కూడా వారు తమ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఆ 12 మంది ముస్లిం మత ప్రచారకులు మరణించారు. వారి మరణానికి గుర్తుగా బారా షాహీద్ దర్గాను ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కట్ నవాబు భార్య ఈ దర్గాను సందర్శించడంతో స్వస్థత చేకూరింది. దీంతో ఆమె రొట్టెలను పంచింది. అప్పటి నుంచి రొట్టెలను పంచడం ఆచారంగా మారింది. ఇక్కడ రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రచారం జరిగింది.

మొదట్లో ముస్లింలు ఇక్కడ రొట్టెలు పంచేవారు, ఆ తర్వాత హిందువులు సైతం దర్గాను సందర్శించి రొట్టెలను పంచే సంప్రదాయంలో భాగం అయ్యారు. స్థల చరిత్ర తెలియక హిందువులు కూడా పెద్ద సంఖ్యలో దర్గాను సందర్శించడంతో ఇక్కడ రోటీలను సౌభాగ్య రోటీలు, విద్యా రోటీలు, ఉద్యోగ రోటీలు, వివాహ రోటీలు, సంతాన రోటీలు, ధన రోటీలు, వీసా రోటీలు అని పేర్లు పెట్టి మరీ అమాయక భక్తులను దోచుకుంటున్నారు. హైందవులు ఇప్పటికైనా మేల్కొని తెలివి తెచ్చుకోవాలి. లేదంటే, మన దేశంలోనే మనం పరాయివాళ్లం అయిపోతాం..