ArticlesNews

కర్ణాటక సంగీత సుస్వర చక్రవర్తి మంగళంపల్లి బాల మురళీకృష్ణ

299views

(జూలై 6 – మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి )

కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాంసులు, వాగ్గేయకారులున్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’ అని శ్రీరామచంద్రుడినే ప్రశ్నించిన భక్తరామదాసు, ‘ఎక్కువ కులజుడైన, హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు’ అని అన్ని కులాలు సమానమేనని చెప్పిన తాళ్లపాక అన్నమాచార్య, ‘దుర్మార్థ చరాధములను దొరా నేన నజాలరా’ అన్న ధిక్కార స్వరాన్ని వినిపించిన త్యాగరాజు, “నిను నమ్మిన నాపై పరాముఖమేల’ అని పార్వతీదేవిని ప్రశ్నించిన శ్యామ శాస్త్రి లాంటి సరస్వతీ పుత్రులున్నారు. అలాంటి మహానుభావుల కోవకు చెందిన వారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. త్యాగరాజు తర్వాత కర్ణాటక సంగీతంలో దిగ్గ జమనదగ్గ బాలమురళీ కృష్ణ కంఠంలో సృష్టిలోని సకలరాగాలు ఒదిగిపోవడమే కాదు, కొత్త కొత్త రాగాలు ప్రాణం పోసుకున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తం గ్రామంలో జన్మించిన బాలమురళి సంగీత వనంలో పుట్టిన పుష్పం. ఆయన తల్లి సూర్యకాంతమ్మ వీణా విద్వాంసురాలు, తండ్రి వేణువు, వయోలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. ఎనిమిదవ ఏట ఆయన తిరవాయూరులోని త్యాగరాజు ఆరాధనోత్సవాల్లో కచేరి చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన తర్వాత సంగీతమే ఆయన వెంట నడిచింది. అప్పటి వరకూ ఆయన పేరు మురళీ కృష్ణ, ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి హరికథా భాగవతార్ ఆయన సంగీత ప్రతిభ తెలుసుకుని బాల మురళి అని దీవించారు. ఆనాటి నుంచి ఆయన పేరు బాలమురళీకృష్ణగా స్థిరపడింది. సంప్రదాయ సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన నవ్యత, సృజనాత్మకత సాధించిన బాలమురళి గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి, సుముఖం, సిద్ధి, మురళి వంటి రాగాలను తానే సృజించారు.

సినీ రంగంలో . ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రకు వన్నెతెచ్చి తన గీతాలు తానే పాడారు. హంసగీతె కన్నడ చిత్రంలో ‘హిమాద్రి సుతే పాహిమాం అన్న కీర్తన ఆలపించినందుకు బాలమురళీకృష్ణకు ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం లభించింది. ‘మాధవాచార్య’ అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారం గ్రహించారు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ పాట ఇప్పటికీ మన మన సుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. జాతీయస్థాయిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలు పొందిన బాలమురళి ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గౌరవాన్ని కూడా పొందారు. దేశ విదేశాల్లో కలిపి ఆయన 26వేలకు పైగా కచేరీలు చేశారు.తన గురు భక్తి చాటుకోవడానికి గురువు పారు పల్లి రామకృష్ణయ్య మీదే అనేక కీర్తనలు రచించారు.

తెలుగువారి కంటే తమిళులు ఆయనను ఎక్కు వగా ఆదరించినప్పటికీ బాలమురళీ కృష్ణకు తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో అభిమానం. “ఆరంభమునకు ఆంధ్రము-ఆచరణకు అరవము’ అని రాసినప్పటికీ ‘తెలుగు వెలుగు కిరణాలు మనకూ మనదేశానికి నవరత్నాభరణాలు’ అని ఆలపించారు. విజయవాడలో చాలాకాలం నివసించా సన్న ప్రేమతో ‘వినుమురా విజయవాణి కనుమురా కృష్ణవేణి-విజయుని జయాలయం-విజయ మాత విమల నిలయం వికచగాన కళా కవితా విచక్షణుల శుభాలయం’ అని అద్భుతంగా రాసి పాడారు. అసమాన ప్రతిభ, అద్వితీయ సంగీత ప్రావీణ్యం, బహుముఖ ప్రజ్ఞాశాలి, కర్ణాటక సంగీత దుర్గాన్ని బలంగా నిర్మించి తెలుగువారికి విశ్వఖ్యాతి తెచ్చిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తెలుగు వాడు కావడం మన పూర్వజన్మ సుకృతం…