ArticlesNews

పరమాత్ముని ప్రతినిధి శ్రీ పాకలపాటి గురువుగారు

63views

( జూన్ 11 – శ్రీ పాకలపాటి గురువుగారు జయంతి )

భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు.ఈ కోవలోని వారే మన తెలుగునేలకు చెందిన బాబుగారుగా పిలువబడే పాకలపాటి గురువుగారు. జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న ముండూరు అగ్రహారంలో దామరాజు గంగరాజు, వెంకమ్మ పుణ్యదంపతులకు మూడవ సంతానంగా పాకలపాటి గురువుగారు 1911 జూన్ 11న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వెంకటరామయ్య.

తన 5వ ఏటనే భాగవత, రామాయణ గ్రంథాలను కంఠస్థం చేసిన ఆయనను చిన్నతనం నుంచే పర్వతాలు, అరణ్యాలు ఆకర్షిస్తూ ఉండేవి. ఈ క్రమంలోనే ఆయన దేశాటనకు బయల్దేరారు. కొండలు, కోనలు తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. అక్కడ కావ్యకంఠవాశిష్ఠ గణపతి ముని వద్ద బాబుగారు మంత్రదీక్ష పొందారు.

పాకలపాటి గురువుగారు మంత్ర, తంత్ర, జ్ఞానయోగ సాధనల్లో ఆరి చేరిన సాధకులే కాదు సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది. ఆయన వనవాసీలను ఎంతగానో అభిమానించారు. వనవాసీలలో భక్తి ప్రవత్తులు కలిగించి, ఆరోగ్య, భోగభాగ్యాలను ప్రసాదించారు. వారిలోని దురలవాట్లను మాన్పించి సన్మార్గులను చేశారు. అలాగే 9వందల గ్రామాల్లో దేవాలయాలను స్థాపించారు.

వనవాసీలు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు. శ్రీపాకలపాటివారు 1970 మార్చ్ 6న శివైక్యం పొందారు. గురువుగారు తన శరీరం చాలించినా స్థూలరూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పాకలపాటి గురువులగారి ఆశ్రమం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం దగ్గర ఉంది. కోయల పాలిట కొంగుబంగారమైన పాకలపాటి గురువుగారు ప్రకృతితో తాదాత్మ్యం పొందిన పరమాత్ముని ప్రతినిధి.