ArticlesNews

హిందూధర్మంలో సూర్య ఆరాధన

88views

(జూన్ 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేకం )
సనాతన హిందూ ధర్మం జీవనాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంత కీలక పాత్ర పోషిస్తాడో తెలుసుకుని, ఈ మొత్తం విశ్వగమనానికి ప్రధాన సూత్రధారి ఆయన అని కీర్తించింది. వేదాల ప్రకాశాన్ని, శక్తిని తనలో కలిగిన దేవుడిగా హిందువులు సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడు ఏడు బంగారు గుర్రాలు కలిగిన రథంలో పద్మంపై కూర్చుని ఉంటాడని రిగ్వేదం పేర్కొంటుంది. ప్రత్యూషానికి అధిపతి అయిన అరుణుడు ఆయనకు రథసారథిగా ఉన్నాడని అభివర్ణిస్తుంది. గరుత్మంతుడి సోదరుడైన అరుణుడు అత్యంత బలమైన, విశాలమైన దేహాన్ని కలిగి ఉంటాడని, ప్రపంచాన్ని సూర్యుడి తాపం నుంచి కాపాడేందుకు ఆయన సూర్యుడి ముందు ఉంటాడని కూడా చెప్తుంటారు. సూర్యుడిని ఉదయం రిగ్వేదంతో, మధ్యాహ్నం యజుర్వేదంతో, సాయంత్రం సామవేదంతో ఆరాధిస్తారు. మనుషులు చేసే మంచి, చెడు పనులను గమనిస్తూ సూర్యుడు తన బంగారు రథంలో ఆకాశంలో కాలచక్రంతో ప్రయాణిస్తుంటాడని, ఆయన రథానికి గల ఏడుగుర్రాలు వారంలోని ఏడు రోజులనే వర్ణన కూడా ఉంది. నారద మహర్షి కూడా తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం సూర్య భగవానుడి ఆరాధన చేశారని చెప్తారు.