News

సకల శుభాలకు మూలం శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన : శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ

96views

సకల దేవతల ఆరాధనకు హనుమంతుని ఆశ్రయించడం ఒక్కటే మార్గమని, తద్వారా సకల శుభాలు చేకూరుతాయని శ్రీనివాసమంగాపురం శ్రీ వశిష్టాశ్రమ శ్రీ లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ ఉద్ఘాటించారు.హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, కర్మ, భక్తి, జ్ఞాన యోగాల ద్వారా ఆంజనేయస్వామి యుగయుగాలకు ఆదర్శప్రాయం అన్నారు. హనుమంతుని అపారమైన భక్తి, కార్యదీక్ష, ధైర్య సాహసాలతో భక్తలోకానికి ఆరోగ్య ప్రదాతగా మారారని తెలియజేశారు.రామ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారందరినీ హనుమంతుడు అనుగ్రహిస్తారని, తులసీదాసు తదితర మహనీయుల చరిత్రను వివరించారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నందుకు టీటీడీని స్వామీజీ అభినందించారు.