ArticlesNews

విన్నపాలు వినవలె

91views

లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. ఈ కవితా ప్రక్రియను విన్నపాలు అని వ్యవహరిస్తారు.

భక్తిసాహిత్యానికి సంబందించిన వచనాల్లో పదాల్లో కోరికల్ని విన్నవించే ధోరణి కనిపిస్తుంది. సింహగిరి నరహరి వచనాలు, శ్రీవేంకటేశ్వర వచనాలు మొదలైనవాటిని ఈ పద్ధతికి దృష్టాంతాలుగా భావించవచ్చు. స్వామి ఆరాధనలో అర్చనలో తాను దాసుణ్నని దాసానుదాసుణ్నని భక్తుడు చెప్పుకోవడం ఉంది. శైవ సాహిత్యంలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. కన్నడంలోని బసవేశ్వర వచనాలు, తెలుగులో పాల్కురికి సోమన ‘గద్య’ల్లోనూ విన్నపాలున్నాయి. విన్నపాల్లో ప్రకృతి తత్వం, పరతత్వం, బంధమోక్షం, మోక్షోపాయం అనే అంశాలు సాదనాలు గోచరిస్తాయి.

విన్నపాలు అనగానే ప్రధానంగా అన్నమయ్య గుర్తుకువస్తాడు. ఆయన విన్నపాలు పలువిధాలుగా ఉంటాయి. శ్రీనివాసుడితో తన గోడు చెప్పుకొంటాడు. తన అంతర్యాన్ని వెళ్ళబోసుకుంటాడు. స్వామి మహిమల్ని క్షేత్ర ప్రశస్తిని ఉత్సవ విశేషాలను సామాన్య జనానికి ఆకర్షణీయంగా చెబుతూ శ్రీనివాసుణ్ని దర్శించుకొమ్మంటాడు.

క్షేత్రయ్య పదాల్లో శృంగారమే ప్రధానంగా గోచరిస్తున్నా అడుగడుగునా విన్నపాలు దర్శనమిస్తాయి. విజ్ఞాపన పదకర్త అన్నారాయనను. భక్తరామదాసు ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అంటూ రామయ్యకు అతడి పత్ని ద్వారా తన మనసులో మాటను చేరవేశాడు. ఆళ్వారులూ తమ విన్నపాలను పాశురాల్లో బంధించారు. ఈ విధంగా విన్నపాలు పండిత పామర జనరంజకమై విశేష ఖ్యాతిని పొందాయి.