News

అమ్మవారి పాదాలుకు పోటెత్తిన భక్తులు

2.6kviews

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ మార్గంలోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ప్రతి ఏడాది పాడేరులోని మోదకొండమ్మ ఉత్సవాల అనంతరం వచ్చే ఆదివారం నాడు భక్తులు అమ్మవారి పాదాలు దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ ప్రభావంతో మోదకొండమ్మ ఉత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు గత ఆది, మంగళవారాలు పాడేరు వచ్చి మోదకొండమ్మను దర్శించుకుని, తమ మొక్కులను తీర్చుకున్నారు. దీంతో ఈ ఆదివారం అమ్మవారి పాదాలు వద్దకు ఊహించని రీతిన భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో భక్తులు ఈ సమయంలోనే మోదకొండమ్మ దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ వారం అమ్మవారి పాదాలుకు సుమారుగా పది వేల మంది భక్తులు కుటుంబాలతో వచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వంటలు చేసుకుని భోజనాలు పూర్తి చేసి సాయంత్రం తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

భక్తుల వాహనాలతో కిక్కిరిసిన ఘాట్‌ మార్గం
ఘాట్‌లోని అమ్మవారి పాదాలు దర్శనానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వారి వాహనాలతో ఘాట్‌ మార్గమంతా కిక్కిరిసిపోయింది. అమ్మవారి పాదాలు కూడలి నుంచి అటు పాడేరు వైపు, ఇటు చోడవరం వైపు సుమారుగా కిలోమీటరు మేర వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలిపేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తన బృందంతో హుటాహుటిన అమ్మవారి పాదాలుకు చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు.