ArticlesNews

అయోధ్య నుంచి శ్రీలంక వరకూ అంతా ‘సుందర’కాండమే!

136views

రామాయణంలో కీలక ఘట్టాలకు వేదికగా ఉన్న శ్రీలంక తదనంతర కాలంలో బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ, తన హైందవ వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. అందుకే మనకు అక్కడ రామాయణానికి సంబంధించి అనేక ప్రదేశాలు, ఆలయాలు కనిపిస్తాయి. తాజాగా, శ్రీలంకలోని సీతా ఎలియలో గ్రామంలో సీతమ్మ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ పవిత్రకార్యాన్ని తిలకించి, పులకించారు. అయోధ్యలోని సరయు నది, గంగానది నుంచినేరుగా విమానంలో తెచ్చిన జలాలను ఈ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించడంతో
ఈ ఇరు ప్రదేశాల మధ్య గల అనుబంధాన్ని, అనుసంధానాన్ని పటిష్టం చేసినట్టయింది.

దాదాపు 25 లీటర్ల పవిత్ర సరయు జలాలను తీసుకుని మే 17 ఉదయం కొలంబో నుంచి ప్రారంభమైన ఉత్సవ రథం, 21వ తేదీ ఉదయం సీతమ్మ ఆలయాన్ని చేరుకున్నది. ఈ జలాలను ఆలయ గోపురాల కుంభాభిషేకంలో ఉపయోగించారు. ఇందుకు తోడుగా, తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన 5000 లడ్డూలను భక్తులకు పంచడం విశేషం. ఈ కార్యక్రమంలో కేవలం శ్రీలంకవాసులే కాక భారత్, నేపాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొనడం రామాయణంలో ఆ ప్రాంతానికి గల ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ‘అశోక వాటిక’గా మనకు తెలిసిన సీతా ఎలియాలోనే రావణుడు సీతమ్మను నిర్బంధించాడు.ఈ ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు.

రామాయణంతో లోతైన చారిత్రిక లంకె కలిగిన సీతమ్మ ఆలయం గతంలో అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణానికి ఒక ‘పవిత్ర శిల’ను అందించింది. ఈ అనుబంధం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సరయు జలాలను ఉపయోగించడంతో మరింత బలపడింది.