News

మే 25 నుంచి దుర్గావాహిని శౌర్య ప్రశిక్షణ వర్గ

73views

బాల, లలిత, అన్నపూర్ణ, వారాహి, పరాశక్తి, భువనేశ్వరి, చండి ఈ అన్నీ కనకదుర్గ నామాంతరాలు. దుర్గాభవానిగా లోకాన్ని కాపాడుతుంది. బాల లలితాన్నపూర్ణగా సున్నిత తత్వమున్నా, సందర్భానుసారం సునిశితంగా వ్యవహరిస్తుంది. వాహిని అంటే నదీ ప్రవాహధార. మరో కోణంలో సేనా విశేషం. ఖ్యాతి అని కూడా అర్థం.ఇప్పుడు అవగతమవుతోంది కదూ! దుర్గావాహిని ఒక అజేయ శక్తిశాలిని.

అబల అనే పదాన్ని నిషేధించి, ‘సబల’ను ఆవిష్కరించింది దుర్గావాహిని మహిళాశక్తి. నేటి యువతుల్లో ధార్మిక నిష్టతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంచి పరిపోషించేందుకు వారంరోజుల విస్తృతస్థాయి ‘శౌర్య ప్రశిక్షణ’ను ఈ మే నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. శ్రీకాకుళంలోని గాయత్రీ కళాశాల ప్రాంగణ వేదికగా మార్గదర్శనం అందిస్తోంది. యుద్ధవిద్యలో మరింత నేర్పు కలిగించి, సాంస్కృతిక వికాసాన్ని అంతటా విస్తరించి, సమైక్య కుటుంబ భావనను ఫలప్రదం చేస్తోంది.

సామాజిక సేవాకార్యక్రమాల పరంపరతో, సంకల్ప బలంతో పురోగమిస్తున్న వ్యవస్థ. బజరంగదళ్ మహిళా విభాగమే దుర్గావాహిని. ధర్మోరక్షితి రక్షితః అన్నదే నాదం, విధానం, ఏకైక సూత్రం.ఇంటాబయటా కూడా నిర్వర్తించాల్సిన వాటి గురించి అధ్యయన, అవగాహన, శిక్షణ, ఆచరణీయ శిబిరాలను నిర్వహిస్తోంది.ముఖ్యంగా 16 నుంచి 36 సంవత్సరాల వారికి మేలిమి బాట చూపుతోంది.

జీవితం అనేక అంశాల సమాహారం. చరిత్ర తెలుసుకోవడం, అధ్యాత్మికత పెంచుకోవడం అందులో అంతర్భాగాలు. వాటితోపాటు వివిధ స్థితిగతుల్లో తనను తాను అన్ని విధాలా రక్షించు కోవడం, ఇతరులనూ సంరక్షించడానికి ముందడుగు వేయడం అత్యవసరాలు. సరిగ్గా ఈ విధమైన వాతావరణాన్ని సృజించడమే ప్రథమ ధ్యేయమని, – ప్రతీ కుటుంబం నుంచీ యువతులు స్ఫూర్తి పొందాలనీ విభాగ నేతలు లోకనాథం ఆనందరావు, శ్రీరంగం మధుసూదనరావు, దుర్గావాహిని ప్రముఖ్ సింహాద్రి హైందవి అభిలాష.