
మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా, బండి దిగకుండా.. ఆంజనేయుని ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా.. బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు. ‘త్రేతాయుగంలో సీతమ్మను వెదికేందుకు లంకకు ప్రయాణం, వారధి నిర్మాణం.. అలా నేనెంత ప్రయత్నించానో, ప్రయాస చెందానో నీకు తెలీదా?! నా ప్రయత్నానికి శ్రీరామచంద్రుని కృప తోడయ్యింది. అందువల్లే నాకు మంచి సేవకుడనే గౌరవంతోపాటు రాముడి అరుదైన ఆలింగనం దక్కింది. మరి నువ్వేమో బండి దిగకుండా, కాలు కదపకుండా, వానకు తడవకుండా నాతోనే పని చేయించాలని చూస్తున్నావు. ఇదెక్కడి న్యాయం భక్తా? ముందు నీ వంతు ప్రయత్నం చేస్తే.. నేను కూడా ఓ చెయ్యి వేస్తాను’ అంటూ అంతర్థానమయ్యాడు. రైతుకు కళ్లు తెరుచుకున్నాయి. వెంటనే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. భక్తుడి బండిని బురదలోంచి బయటకు వచ్చేలా చేశాడు హనుమంతుడు. కృషి లేనిదే దేవుడైనా సాయం చేయడు- అంటూ స్వామి సుందర చైతన్యానంద చెప్పిన కథ ఇది. లోతైన అంశాలను తేలికైన కథలుగా చెబుతుంటారాయన.





