
సాక్షాత్తు ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన శంకరాచార్యులవారు కైలాసం వెళ్లి పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 5 స్ఫటిక లింగాలను, పార్వతీదేవి శత శ్లోకాల మంత్రగ్రంథాన్ని ఇచ్చాడు. ఆ సంపదను ఆనందంగా స్వీకరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు. జగన్మాత వైభవాన్ని తెలియజేసే ఆ పవిత్ర గ్రంథం కైలాసంనుంచి భూలోకానికి చేరడాన్ని శివభక్తుడైన నందీశ్వరుడు భరించలేక.. లాక్కోబోయాడు. దాంతో 59 శ్లోకాలున్న తాళపత్రాలు నందీశ్వరుని చేతికి చిక్కగా, 41 శ్లోకాలున్న తాళపత్రాలు ఆదిశంకరులవారికి దక్కాయి.
జగన్మాత తనకు ప్రేమగా ఇచ్చిన గ్రంథం పూర్తిగా దక్కలేదని శంకరాచార్యులు చింతిస్తుండగా- ‘ఆ 59 శ్లోకాలు నువ్వు పూరించాలన్నది నా సంకల్పం. కనుకనే ఇలా జరిగింది. నువ్వే రచించు’ అంటూ అమ్మవారి స్వరం వినిపించింది. అమ్మ ఆజ్ఞ విన్నదే తడవుగా పర్వత శిఖరం నుంచి దూకే ఉత్తుంగ గంగాప్రవాహంలా 59 శ్లోకాలు శంకరుల నోటినుంచి వెలువడ్డాయి. దేవీ ప్రసాదితమైన 41 శ్లోకాలు, ఆదిశంకరులు పలికిన 59 శ్లోకాలు కలిసి సౌందర్యలహరిగా ప్రసిద్ధికెక్కాయి. పరమశివుడు ప్రసాదించిన 5 స్ఫటికలింగాలు- కంచిలో యోగలింగంగా, కేదార్‌లో ముక్తిలింగంగా, నేపాల్‌లో వరలింగంగా, చిదంబరంలో మోక్షలింగంగా, శృంగేరిలో భోగలింగంగా వెలిశాయి.
కొండూరి పద్మపార్వతీశం





