News

హిందూ సంప్రదాయంలో కజకిస్థాన్‌ జంట వివాహం

254views

తమిళనాడు రాష్ట్రం మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్‌లో కజకిస్థాన్‌ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన డిమిత్రి, ఎలోనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. క్రైస్తవ మతానికి చెందిన వీరు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ మతం, తమిళ సంస్కృతి, సంప్రదాయాలపై ఇష్టం పెంచుకున్న వీరు హిందూ మతంలోకి మారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇటీవల తమిళనాడుకు వచ్చి హిందూ మతం స్వీకరించారు. తరువాత తమిళనాడులోని పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. శుక్రవారం మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా తిర్కుడైయూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం మేరకు శనివారం వేకువ జామున వివాహం చేసుకున్నారు. అనంతరం తిరుక్కడైయూర్‌లోని అభిరామి సమేత అమృతగడేశ్వరుడిని దర్శించుకున్నారు.