
334views
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు శనివారం అమ్మవారికి తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువంతో అర్చన చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణంలో ఉత్సవమూర్తికి పుష్పార్చన జరిగింది. ఆలయ ఈవో కె.ఎస్. రామరావు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు పుష్పాలతో ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి పుష్పార్చన జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచహారతుల సేవ, హారతిని ఇవ్వగా ఉభయదాతలు, భక్తులు సేవలో పాల్గొన్నారు. అర్చన అనంతరం అమ్మవారికి ఉపయోగించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు.





