News

కాశీలో పోలీసులకు ధోతీ-కుర్తాపై వివాదం

222views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. ఇక నుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది. దీనిపై వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్షమాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు.

ఈ నిర్ణయంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలను కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఖండించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘ఆలయాల్లో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ రద్దీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించదు.భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్ని సార్లు పోలీసుల తీరు ప్రజలకు బాధ కలిగించొచ్చు. అదే వారు అర్చకుల మాదిరిగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ డ్రెస్‌కోడ్‌ను మార్చాం’’ అని పేర్కొన్నారు.