
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పది రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభం తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ధ్వజస్తంభం పునాది తవ్వి, దాని అడుగున ఉన్న అవశేషాలను కూడా తొలగించారు. ఈ ధ్వజస్తంభాన్ని 1934లో ప్రతిష్ఠించినప్పుడు అందులో వేసిన 15.4 గ్రాముల బంగారు వస్తువులు, నవరత్నాల ఉంగరం, 850 గ్రాముల బరువైన రాగి రేకు బయట పడ్డాయి. వాటిని తూకం వేసి దేవస్థానం ట్రెజరీలో భద్రపరిచామని ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు. వీటిని ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న నూతన ధ్వజస్తంభం గర్భంలో తిరిగి నిక్షిప్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో ధ్వజస్తంభం తొలగింపు పనుల పర్యవేక్షణ కమిటీ సభ్యులు డిప్యూటీ ఈఓ రమేష్‌బాబు, ఈఈ నరసింహరెడ్డి, డీఈ ఉదయ్, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు. నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఈ నెల 18న శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరుకు చెందిన ఓ భక్తుని కుటుంబ సభ్యులు 130 మంది కలసి ఈ ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠిస్తున్నారు. ప్రతిష్ఠ అనంతరం దానికి సుమారు రూ.4 కోట్ల వ్యయంతో బంగారు రేకు తాపడం చేయనున్నారు.





