ArticlesNews

ఉగాది నాడు ఉదయించిన యుగపురుషులు డా.హెడ్గేవార్‌జీ

246views

(ఏప్రిల్ 9 -డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌ జీ జయంతి)

దేశాన్ని పరిరక్షించుకోవాలంటే దేశ సంస్కృతిని కాపాడుకోవాలి. సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశం మొత్తం తయారు కావాలి. ఇదే లక్ష్యంతో మహాయజ్ఞం మొదలుపెట్టి..ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే లక్షలాది స్వయంసేవకులను తయారు చేశారు. ఆయనే రాష్ట్రీయస్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకులు పరమపూజనీయులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. మనదంతా ఒకే జాతి అన్న భావన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మూల సిద్ధాంతం. హైందవాన్ని ఒక మతంగా కాకుండా జీవన విధానంగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ను 1925లో విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్‌జీ స్థాపించారు.

హెడ్గేవార్‌గారు 1889 ఉగాది నాడు నాగ్‌పూర్‌లో జన్మించారు. వారి కుటుంబ మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఇందూరు జిల్లాలోని కందకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం శతాబ్దాల క్రితం నాగ్‌పూర్‌కు వెళ్లి స్థిరపడింది. హెడ్గేవార్‌గారు జన్మత: దేశభక్తులు. పూణేలో చదువుకునే సమయంలో బ్రిటీష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి వందేమాతరం పాడారు. అంతే కాదు విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన వేడుకల్లో స్వీట్లు పంచిపెట్టారు. ఆ స్వీట్లు తినేందుకు హెడ్గేవార్ నిరాకరించారు. వాటిని విసిరివేశారు. మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెడ్గేవార్ కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకొని నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని గానీ, ఆస్పత్రి ప్రారంభించి డబ్బు సంపాదించాలని గానీ ఆయన అనుకోలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

1920 తర్వాత మన జాతీయ నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో సత్యం, అహింసలను ఆదర్శంగా స్వీకరించారు. అయితే ఇదే సమయంలో జాతీయ భావనను ఒక పద్ధతి ప్రకారం నష్టపరుస్తూ, మన యావత్ జాతిని సమూలంగా విధ్వంసం చేసే ప్రయత్నం ఊపందుకుంది. డాక్టర్ జీ ఈ పరిస్థితిని గమనించారు. జాతీయత ఆధారంగా సంపూర్ణ సమాజాన్ని మేల్కొలిపి, జాతిని సంఘటిత పరచే శాశ్వత కార్యాన్ని చేపట్టారు. అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. 1940 సంవత్సరంలో పూణేలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శిబిరంలో డా.హెడ్గేవార్ ప్రసంగిస్తూ, ‘‘హిందుస్థానం ఒక జాతి, హిందూ సమాజం జాతీయ సమాజం. మనమందరం ఈ సమాజ అవయవాలు వంటివారం. సమాజం యొక్క ప్రతి అవయవం జాతి కొరకే ఉపయోగపడాలి. జాతి రూపంలో ఉండే విరాట్ స్వరూపానికి మనలను మనం సమర్పించుకొని పని చేయడమే మన కర్తవ్యం,’’ అని దిశానిర్దేశం చేశారు.

డాక్టర్ జీ హిందూ సమాజ సంఘటన కార్యాన్ని ప్రారంభించేముందు కొంతమంది ఆయన్ను పరిహసించారు. ఈ సమాజాన్ని సంఘటితం చేయడం ఎవరి వల్ల కాదన్నారు. అయితే డాక్టర్ జీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. వాదనకు దిగలేదు. బదులుగా అందరి దీవెనలు అడిగారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ను 1925లో ప్రారంభించి హిందూ సంఘటన కార్యం కోసం శాఖ అనే మంత్రాన్ని జాతికి అందించి 1940లో పరమపదించారు. ఆ 15 సంవత్సరాల్లో వారు సంఘ కార్యాన్ని దేశం నలుమూలలా వ్యాపింపజేశారు.

ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వేగంగా జరుగుతోంది. హిందూ సంఘటన కార్యం విజయవంతమై వచ్చిన ఫలితాలను చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. 2018లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ హెడ్గేవార్ గారి నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ‘‘భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కేబీ.హెడ్గేవార్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చాను,’’ అని రాశారు. హెడ్గేవార్ మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఈ ఒక్క మాట చాలు..