
(ఏప్రిల్ -9 నూతన సంవత్సరం ; వర్ష ప్రతిపద )
హిందూ క్యాలెండర్‌లో మొదటి తేదీని ప్రతిపద అంటారు. ఇందులో ప్రతి అంటే ముందు, పద అంటే అడుగు. రెండింటిని కలిపితే అడుగు ముందుకు వేయడం అని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభం చైత్ర శుక్ల ప్రతిపద నుండి పరిగణించబడుతుంది. గణిత మరియు ఖగోళ గణనల ప్రకారం గ్రహాలు, వారాలు, మాసాలు మరియు సంవత్సరాలు ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. విక్రమ్ సంవత్ క్యాలెండర్ ప్రకారం హిందూ నూతన సంవత్సరాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 09న నిర్వహించుకుంటున్నాము.
మన సంవత్సరాలు ఏ దేవుడు, దేవత లేదా వ్యక్తుల పుట్టుకపై ఆధారపడి లేవు. అలాగే హిజ్రీ క్యాలెండర్ తరహాలో నిర్దిష్ట కులానికి లేదా వర్గానికి సంబంధించినది కాదు. మన అద్భుతమైన సంప్రదాయం స్వచ్ఛమైన అర్థంలో ప్రకృతి యొక్క ఖగోళ సూత్రాలపై ఆధారపడింది. మన భారతీయ క్యాలెండర్ ఆధారం పూర్తిగా లౌకికమైనది. బ్రహ్మపురాణం ప్రకారం చైత్రమాసం మొదటి రోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడు. ఇది మన భారతీయుల విశ్వాసం. అందుకే చైత్ర శుక్ల ప్రతిపాదం నుండి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పరిశీలిస్తాము. వర్ష ప్రతిపద ఆధ్యాత్మిక కోణం నుండి కూడా చాలా పవిత్రమైనది. వర్ష ప్రతిపదను మహారాష్ట్రలో గుడి పడ్వా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాది అని జమ్మూకాశ్మీర్‌లో నవ్రే, పంజాబ్, హర్యానా మొదలైన వాటిలో బైసాఖీ అని పిలుస్తారు.
వర్ష ప్రతిపదకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ దేవుడు ఈ రోజు సూర్యోదయం సమయంలో సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. విక్రమాదిత్యుడి మాదిరిగానే శాలివాహనుడు సైతం తన రాజ్యాన్ని స్థాపించేందుకు ఈ రోజును ఎంచుకున్నాడు. ఈ రోజు శ్రీరాముని పట్టాభిషేక దినంగా కూడా పరిగణించబడుతుంది. ఇది నవరాత్రుల మొదటి రోజు. వర్ష ప్రతిపద నాడే సిక్కుల రెండవ గురువు శ్రీ అంగద్ దేవ్ జీ జనించారు. ఇదే రోజున స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. సింధ్ ప్రాంతానికి చెందిన హిందూ ధర్మ పరిరక్షకుడు భగవాన్ ఝూలేలాల్ సైతం ఈ నేలపై అవతరించింది ఈ రోజునే. యుధిష్ఠర చక్రవర్తి పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగింది. ఈ పవిత్రమైన రోజునే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకుడు పరమపూజనీయ డా.కేబీ.హెడ్గేవార్ జన్మించింది. అందుకే వర్ష ప్రతిపద మన సామాజిక, మత పరమైన కార్యకలాపాలకు కీలకమైన తేదీగా గుర్తింపు పొందింది. జాతీయ ఆత్మగౌరవం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఇది పవిత్రమైన రోజు. ఈ రోజు నుంచే ప్రకృతిలో మార్పు గణనీయంగా కనిపిస్తుంది. నవ వసంతం పరిమళాలతో జగమంతా నూతన సౌందర్యం సంతరించుకుంటుంది. నవ జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది.
క్రీస్తుశకాన్ని సాధారణ శకమని, సామాన్య శకమని, వ్యవహార శకంగా భావించాలన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం చారిత్రక అనభిజ్ఞతకు నిదర్శనం. ఎందుకంటే, మొత్తం ప్రపంచానికి మాత్రమే కాక విశ్వ వ్యవస్థకు వర్తించే కాలగణన మాత్రమే సాధారణ కాలగణన కాగలదు. బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశానికి రాకపూర్వం నుంచి మన దేశంలో మొత్తం విశ్వవ్యవస్థకు వర్తించే కాలగణన అమలులో ఉంది. ఇది అన్ని మతాలకు వర్తించే సర్వమత సమభావ శకం. జూలియస్ క్యాలెండర్ కానీ గ్రెగేరియన్ క్యాలెండర్‌కు కాని శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. మన దేశంలో సౌరమాసం, చాంద్రమాసం, నక్షత్రమాసం, బృహస్పతి మాసం వంటి కాలగణన పద్ధతులున్నాయి. ఇవి పరస్పరం ధ్వంసం చేసుకోలేదు. వీటి మధన్య సమన్వయం ఏర్పడింది. సమన్వయ కాలగణన మన భారత జాతీయ జీవన వాస్తవం. అందుకే, మనం గర్వంతో జీవించే స్ఫూర్తిని మేల్కొల్పాలంటే మన హృదయంలో దేశభక్తి అనే బీజం వర్థిల్లాలంటే మనం హిందూ జాతీయ క్యాలెండర్ తేదీలను ఆశ్రయించాలని జాతీయ చైతన్యవేత్త స్వామి వివేకానంద స్పష్టం చేశారు.





