
( ఏప్రిల్ 9 – భగవాన్ ఝూలేలాల్ జయంతి )
సింధీ ప్రజల ఆరాధ్య దైవం భగవాన్ సంత్ ఝూలేలాల్. హిందూ పంచాంగం ప్రకారం ఝూలేలాల్ జయంతిని చైత్రమాసంలో ద్వితీయ తిథిన జరుపుకుంటారు. ఈయనను సింధి ప్రజలు వరుణ దేవుని అవతారంగా భావిస్తారు. భగవాన్ ఝూలేలాల్ జయంతిని సింధి ప్రజలు ‘‘చేతీ చాంద్’’గా, దీనినే సింధీ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ చేతీ చాంద్ ఉత్సవం చైత్రమాసంలో నవరాత్రి మరుసటి రోజున అనగా చైత్ర శుక్ల ద్వితీయ రోజున జరుపుకుంటారు. జలంతోనే సర్వసుఖాలు, మంగళకరం ప్రాప్తిస్తాయని సింధి ప్రజల విశ్వాసం. అందుకే వీరికి ఈ ఉత్సవం ఎంతో విశేషమైనది.
సింధ్ ప్రాంతపు రాజు మిరఖ్ షాహ్ ఎంతో క్రూరుడే కాక అతివాద ఇస్లాం ఆక్రమణకారుడు కూడా. బలవంతపు మత మార్పిడీలు చేయడమే కాకుండా ఎదురు తిరిగిన వారిని అత్యంత క్రూరంగా హింసించి హతమార్చేవాడు. మిరఖ్ షాహ్ తన ప్రాంతంలోని హిందువులను ఇస్లాం మతం స్వీకరించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఆదేశాలకు భయపడి పలువురు హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే మరికొందరు మిరఖ్ షాహ్‌ను కలిసి కొంత సమయం ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు. వీరికి సమయం ఇస్తే మాత్రం ఏం చేయగలరు, గత్యంతరం లేక ఇస్లాంలోకి మారడం తప్ప అన్న విశ్వాసంతో మిరఖ్ షాహ్ అంగీకరిస్తాడు.
ఇస్లాం మతంలోకి మార్చేందుకు ఇష్టపడని హిందువులు అందరూ తమ పిల్లాపాపాలను తీసుకొని సింధు నదీ తీరానికి చేరి జలదేవుడైన వరుణుడిని ప్రార్థించారు. అలా వారు దీక్షగా రేయింబవళ్లు ప్రార్థనలు చేయగా 40వ రోజు వారికి ఒక అశరీరవాణి వినిపించింది. బాధపడకండి నేను వస్తున్నాను, ఇప్పటి నుండి ఎనిమిది నెలల తర్వాత నేను నస్సర్‌పూర్‌లో జన్మిస్తాను అని ఆకాశవాణి తన సందేశం అందించింది. ఇది విన్న హిందువులు సంతోషంతో తమ ఇళ్లకు చేరి అనంతరం మిరఖ్ షాహ్‌ను మరింత గడువు ఇవ్వాల్సిందిగా వేడుకుంటారు. దానికి ఆయన సమ్మతిస్తూ, మీ దేవుడితోనే ఇస్లాం మతం స్వీకరింపజేస్తాను, అప్పుడు మీరు కూడా మతం మారక తప్పదని పరిహాసం ఆడి పంపించి వేస్తాడు.
అకాశవాణి చెప్పినట్లుగానే 8 నెలల తర్వాత చైత్ర శుక్ల పక్ష ప్రతిపాద నిధి నాడు రతన్‌రాయ్ ఠాకూర్, దేవకి దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడికి ఉదయ్ చంద్ అని నామకరణం చేశారు. ప్రేమగా ఉదేరోలాల్, అమర్‌లాల్ అని పిలుచుకునేవారు. ఉదయ్ చంద్‌ను ఊయలలో వేయగా అది దానంటదే ఊగడం ప్రారంభించేది. దీంతో ఆ పిల్లవాడిని ఝూలేలాల్ అని పిలవడం ప్రారంభించారు. కాల క్రమంలో ఆ పేరే స్థిరపడిపోయింది.
ఝూలేలాల్ చిన్నతనం నుంచే తన మహిమలను చూపడం ప్రారంభించాడు. చిన్నారి ఝూలేలాల్ సంగతి ఏంటో చూడమని మిరఖ్ షాహ్ తన మంత్రి అహీరియోను విషం కలిపిన గులాబీ పువ్వు ఇచ్చి పంపుతాడు. ఆ గులాబీని ఇస్తుండగా బాలుడు నోటితో గాలి ఊదగానే అది మాయమైపోతుంది. తర్వాత అహీరియోకు తన ఎదుట ఒక వృద్ధుడు కనిపిస్తాడు. మళ్లీ అదే వృద్ధుడు 16 ఏళ్ల నవయువకుడిగా దర్శనం ఇస్తాడు. ఆ వెంటనే మెరుస్తున్న ఖడ్గాన్ని చేతబూని గుర్రంపై కూర్చున్నట్లుగా ఝూలేలాల్ కనిపిస్తాడు. దీంతో అహీరియో అక్కడ నుంచి పారిపోయి మిరఖ్ షాహ్‌కు విషయం చెబుతాడు. ఇది నమ్మని మిరఖ్ షాహ్ ఒక రోజు ఝూలేలాల్‌ను తన రాజసభకు పిలిపిస్తాడు. అనంతరం ఖైదు చేసేందుకు ఆజ్ఞాపిస్తాడు. ఝూలేలాల్‌ను బంధించేందుకు సైనికులు ముందుకు రాగానే రాజమహల్‌లో మంటలు చెలరేగుతాయి. ‘‘నీ అన్వరుడు నా ఈశ్వరుడు ఒక్కడే అయినప్పుడు నా వాళ్లను ఎందుకు వేధిస్తున్నావు,’’ ఇకనైనా నీ పనులు మానుకో అని ఝూలేలాల్ హెచ్చరిస్తారు.
రాజమహల్‌లో చోటు చేసుకున్న పరిణామాలను చూసి మిరఖ్ షాహ్ భయభ్రాంతులకు గురై తన తప్పు మన్నించాల్సిందిగా ఝూలేలాల్‌ను వేడుకుంటాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చల్లారతాయి. తన మహిమాన్విత జన్మ, జీవనంతో ఝూలేలాల్ సింధ్ ప్రాంతంలోని హిందువుల ప్రాణాలు రక్షించడమే కాక హిందూ ధర్మాన్ని కూడా రక్షించారు. మిరఖ్ షాహ్ వంటి ఎందరో అతివాద ముస్లింలు వచ్చి మత మార్పిడి అనే రక్త క్రీడను సాగించినా భగవాన్ ఝులేలాల్ కారణంగా సింధ్‌లో వారి ఆటలు సాగలేదు. ఈ రోజు కూడా భగవాన్ ఝూలేలాల్ సింధ్ ప్రజల ఐక్యతకు, శక్తికి, సాంస్కృతిక కార్యక్రమాలకు మూలం. జలం, జ్యోతి ఇవే తన వాస్తవిక రూపమని భక్తులకు ఝూలేలాల్ బోధించారు. ఆయన సమదృష్టితో ప్రజలందరినీ అక్కున చేర్చుకున్నారు. మత సద్భావన సందేశం ఇస్తూ దరియాహి పంత్‌ను స్థాపించారు.





