News

అన్నమయ్య సంకీర్తనలతో పులకించిన నారాయణగిరి

237views

తిరుమలలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతిని పురస్కరించుకుని సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌న్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు.

అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. గత 15 ఏళ్లుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీవారి అనుగ్రహం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలను జన బాహుళయంలోకి తీసుకువెళ్లడానికి మరింత మంది యువ కళాకారులు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వామీజీకి గరుడ పురాణం 1– 2 పుస్తక ప్రసాదాన్ని ఈవో ఏవీ.ధర్మారెడ్డి అందించారు. తరువాత స్వామీజీకి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.