News

ఉగాది ఏర్పాట్లపై దృష్టి సారించండి

228views

ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో శ్రీశైలం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది క్షేత్ర పరిధిలో ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఈఓ పెద్దిరాజు సూచించారు. ఆదివారం ఆయన ఉగాది మహోత్సవాల నేపథ్యంలో క్షేత్రంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథియేటర్‌, మల్లమ్మ కన్నీరు, పలు ఉద్యానవనాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, రింగ్‌రోడ్డు మొదలైన వాటిని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తమ విభాగంలో సిబ్బందిని సమన్వయపరుస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేదతీరేందుకు ఇంకొన్ని చోట్ల కూడా చలువ పందిర్లు వేయాలని ఆదేశించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే మరిన్ని అదనపు ప్రదేశాలలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం మంచినీటి సరఫరా, లైటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్షేత్ర పరిధిలో పలుచోట్ల అన్నదానం చేస్తున్న స్వచ్ఛందసేవా సంస్థలకు, దేవస్థానం తరుఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్ర పరిధిలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగిస్తూ డంప్‌యార్డ్‌కు తరలించాలని సూచించారు. శౌచాలయాల శుభ్రత పట్ల అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. యజ్ఞవాటిక వద్ద పార్కింగ్‌ ప్రదేశాలలో ఆయా బస్సులు నిలిపేందుకు రీజియన్ల మాదిరిగా, డివిజన్ల వారీగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.