News

పుంగనూరు జాతరకు భారీ ఏర్పాట్లు

332views

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో కులమతాలకు అతీతంగా సుమారు ఎనిమిది శతాబ్దాలుగా జమీందార్ల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను ఈనెల 2, 3 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఈసారి కూడా అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ కుటుంబ సమేతంగా హాజరై సారె సమర్పించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది రానున్నారు.

జాతర ఇలా..
జమీందార్ల కుల దైవమైన సుగుటూరు గంగమ్మను మంగళవారం తొలుత ప్యాలెస్‌లో జమీందార్లు విజయరాణెమ్మ, సోమశేఖర్‌ చిక్కరాయులు, మల్లికార్జున రాయులు, వారి కుటుంబ సభ్యులు 2న మంగళవారం పూజలు నిర్వహిస్తారు. అనంతరం పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, బుధవారం వేకువజామున నుంచి భక్తుల సందర్శనార్థం ఆలయంలోకి అనుమతిస్తారు. అమ్మవారికి బెస్తవారు, యాదవ కులస్తులు, తోటి కులస్తులచే పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బజారువీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో గంగమ్మ, బాలాజీ థియేటర్‌ వద్ద మలారమ్మ గంగమ్మ, మైసూర్‌ బ్యాంకు వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ, కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్‌పేటలోని నడివీధి గంగమ్మను కొలువు దీరుస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. భక్తులు మట్టి కుండలకు మామిడి ఆకులు, వేపాకు, పూలతో గెరిగెలను అలంకరించి పలు వేషధారణల్లో వచ్చి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు.

పటిష్ట ఏర్పాట్లు..
జాతరకు సుమారు లక్షమంది భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌, సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలో ప్రత్యేక విద్యుత్‌ దీపాలు, చలువపందిళ్లు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు.