News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవి

335views

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవని లఘు ఉద్యోగ భారతి నేషనల్‌ సంఘటన్‌ మంత్రి ప్రకాష్‌చంద్ర అన్నారు. అరండల్‌ పేటలోని యోగి భవన్‌లో ఆదివారం లఘు ఉద్యోగ భారతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభాగం సభ్యుల సమావేశం నిర్వహించారు. తొలుత భరతమాత, విశ్వకర్మ చిత్ర పటాలకు పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి యోగీష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాష్‌చంద్ర మాట్లాడారు. కుటీర, చిన్న తరహా పరిశ్రమల స్థాపన, ఆర్థిక వనరులు, అనుమతులకు ప్రభుత్వ విభాగాల సంప్రదింపులు, ఉత్పత్తుల మార్కెటింగ్‌ తదితర అంశాలను వివరించారు.

లఘు ఉద్యోగ భారతి నేషనల్‌ ఉపాధ్యక్షుడు హరిహరన్‌ రామ్మూర్తి మాట్లాడుతూ.. ప్రతి రాష్ట్రంలో సభ్యుల సంఖ్య పెరిగితే.. వ్యవస్థ బలపడుతుందని, తద్వారా తమ వాణిని ప్రభుత్వానికి వినిపించవచ్చన్నారు. త్వరగా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బ్యాంకు రుణాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీ, ఇన్సెంటివ్స్‌, వాయిదాలు చెల్లింపుల లోటు పాట్లను వివరించారు. తులసీ సీడ్స్‌ అధినేత తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఉత్పత్తిదారుడు నిరంతరం పరిశోధనలు చేస్తూ కొత్త వస్తువులకు రూపకల్పన చేయాలని సూచించారు.

రాష్ట్ర అధ్యక్షుడు మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచ ఉత్పత్తులలో యాభై శాతం భారతదేశం నుంచి తయారవుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి యోగీష్‌ మాట్లాడుతూ.. ఏపీలోని ప్రతి జిల్లాలో అనేక సహజ, మానవ వనరులు ఉన్నాయని, తయారీ విధానం, ఎగుమతి, సర్వీస్‌లకు అనుకూలమని చెప్పారు. వచ్చే ఐదేళ్లల్లో దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని సూచించారు.