ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 44 ; బొక్కా చలపతిరావు

397views

బొక్కా చలపతిరావు గుడివాడ 1930లో స్కూల్ ఫైనల్ చదువుతూ స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకాడు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆరోజు ఖాదీ కట్టిన చలపతిరావు జీవితం అంతా ఖద్దరు తోనే గడిపాడు. మీసాలు సరిగా రానివాడు ఉద్యమం చేసేవాడా అని ఎద్దేవా చేసినా, చదువు పాడు చేసుకుని చెడి పోదామనుకుంటున్నావా! అని హెడ్మాస్టర్ హెచ్చరించినా, ఉరికంబం ఎక్కించమంటావా అని బ్రిటీష్ పోలీస్ అధికారి బెదిరించినా బొక్కా చలపతిరావు వెనక్కి తగ్గింది లేదు. తాను పెట్టుకున్న లక్ష్యాలు ఏవో వాటిని ఎన్నడూ వదలలేదు. 17 ఏళ్ళ వయసులో 13 నెలల జైలు శిక్ష విధించి రాజమండ్రికి పంపుతున్నామంటే అది దేశమాత శృంఖలాలు తొలగించటంలో తనకు లభించిన తొలి అవకాశంగా భావిస్తూ పోలీసు వాహనం ఎక్కాడు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తిరిగి ఉద్యమబాట పట్టారు. ప్రమాదకర వ్యక్తిగా భావించి పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే విడుదల చేయటంతో తిరగుడివాడ విచ్చేసి చెరువు గట్టున పెట్టిన సమావేశంలో బ్రిటీష్ పాలకులను విమర్శిస్తూబొక్కా చలపతిరావు చేసిన ప్రసంగం వినటానికి పదివేల మంది వచ్చారు. ఆయన మాట్లాడిన ప్రతి విమర్శనాత్మక పదానికి చప్పట్లు మారుమ్రోగాయి. పోలీసులు ఆ జనాభాని కాదని వచ్చి బొక్కా చలపతిరావుని అరెస్టు చేసి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తే మూడు, నాలుగు గంటలు జనం అడ్డుకున్నారు. మూడు, నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్న జైలుకి తరలించేందుకు మూడు గంటల పైన పట్టింది.

జైలులో పోలీసులు కొట్టిన దెబ్బలకు తల పగిలి, ఆసుపత్రి పాలయ్యారు. మళ్ళీ అరెస్టు, ఇంటి మీద నిఘా, ఆయన దగ్గర ఉన్న పుస్తకాలపై సెన్సార్, ఫర్నిచర్ జప్తు చేసి ఆయనిన లొంగదీసుకోగలం అనుకున్నారు కాని బొక్కా చలపతిరావు ఏమాత్రం లొంగలేదు. స్వాతంత్ర్యం సిద్దించే సమయానికి బొక్కా చలపతిరావు జైలులో వున్నాడు. ఆగస్టు 15న ఖైదీల విడుదలతో బయటకు వచ్చాడు చలపతిరావు. సామాజిక సేవకు జీవితం అంకితం చేసారు. స్వాతంత్య్ర్యం లభించేవరకు పెళ్ళి గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత తాను విధవా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అనాధ శవాల అంతిమ సంస్కరణలు నిర్వహించేవారు. వారా సంఘానికి 5 ఏళ్ళు గౌరవాధ్యక్షుడిగా పనిచేసారు. కొంతకాలం గుడివాడ పురపాలక సంఘ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. తలపై తగిలిన లాఠీ దెబ్బలకు శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయిన వీరు ఎవరు ఏమి ప్రశ్నించినా నవ్వు ముఖంతో స్పందించేవారు. చివరిక్షణం వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు, సామాజిక సేవకు కట్టుబడి జీవించిన ధన్యజీవి బొక్కా చలపతిరావు.