ArticlesNews

భయం ఎరుగని భారతీయులు-మరపురాని అమరవీరులు

360views

(మార్చి 23 – షాహీద్ దివాస్)

దిల్ సే నిక్‌లేగీ నా మర్ కర్..వతన్ కీ ఉల్ఫత్
మెరీ మిట్టీ సేభీ ఖుష్బూ-ఏ-వతన్ ఆయేగీ

దీని అర్థం ఏంటంటే…‘‘మాతృభూమిపై నా ప్రేమను, నా అభిమానాన్ని మరణం కూడా ఆపలేదు. మరుభూమికి చేరిన తర్వాత కూడా నా అస్తికల నుంచి కూడా ఈ మట్టి వాసనే పరిమళిస్తుంది’’, అని. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎంతోమంది వీరులు ఉన్నా..వారిలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విడిపించేందుకు వీరు చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. మదమెక్కిన బ్రిటిషర్లకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను ఈ దేశానికి అంకితం ఇచ్చారు. సరిగ్గా 93 ఏళ్ల క్రితం మార్చ్ 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ముగ్గురు దేశం కోసం తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగానికి గుర్తుగా మనం మార్చి 23న ‘షాహీద్ దివాస్’‌ను జరుపుకుంటున్నాము.

దేశ స్వాతంత్ర్యోద్యమంపై చెరగని ముద్రవేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపజేసుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలోకి దూకాడు. అయితే గాంధీజీ ఈ ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్నిభగత్ సింగ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి తన స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాడు. రాజ్‌గురు 1908 ఆగస్టు 24న పూనా సమీపంలోని భీమా నది ఒడ్డున ఉన్న ఖేద్ అనే గ్రామంలో పార్వతిదేవి, హరినారాయణ దంపతులకు జన్మించాడు. తన 14వ ఏట ఇల్లు వదిలిన రాజ్‌గురు భారత్ సేవా మండల్‌లో చేరాడు. ఆ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్‌తో రాజ్‌గురుకు పరిచయం ఏర్పడింది. ఆజాద్ విప్లవ బీజాలను వేస్తుంటే వాటిని తనలో పాతుకొని స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టాలని ఆ యుక్త వయసులోనే రాజ్‌గురు నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ వారిని చంపి, నేను.. నా దేశం కోసం ఆత్మబలిదానం ఇవ్వడానికి సిద్ధమని నాడే ప్రకటించాడు. భగత్‌సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి సుఖ్‌దేవ్. పూర్తి పేరు సుఖ్‌దేవ్ థాపర్. 1907 మే 15న లూథియానాలో రామ్‌లాల్ థాపర్, రల్లీదేవి దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో మేనమామ లాలా అచింత్రం వద్ద పెరిగిన సుఖ్‌దేవ్ బ్రిటీష్ రాజ్ భారతదేశంపై విధించిన క్రూరమైన దురాగతాలను చూశాడు. భారతదేశాన్ని బ్రిటీష్ ఆధిపత్య సంకెళ్ల నుంచి విప్పుతానని తన యుక్త వయసులోనే ప్రతిజ్ఞ చేశాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్న సుఖ్‌దేవ్ ‘నౌజవాన్ భారత్ సభ’ను ఏర్పాటు చేసి యువకులను స్వాతంత్ర్య సంఘర్షణకు సన్నద్ధం చేసేవాడు.

భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ముగ్గురూ బ్రిటీష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ ఆందోళన చేపట్టగా..బ్రిటీష్ పోలీస్‌అధికారి స్కాట్ జరిపిన లాఠీఛార్జ్‌లో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ బూనిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు..మరో పోలీస్ అధికారి జాన్ సాండర్స్‌ను స్కాట్‌గా పొరబడి అతడిని కాల్చి చంపారు. అనంతరం 1929 ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేశారు. భారత స్వాతంత్ర్య కాంక్షాబలాన్ని తెలియజేసేందుకే ఇలా చేశామంటూ పోలీసులకు లొంగిపోయారు. అయితే వీరిని కోర్టు దోషులుగా ప్రకటిస్తూ మరణశిక్ష విధించింది.

భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను 1931 మార్చ్ 23న లాహోర్ సెంట్రల్ జైలులో సాయంకాలం 7 గంటల 33 నిమిషాలకు ఉరి తీశారు. ముగ్గురు విప్లవ వీరులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడి ప్రాణత్యాగం చేశారు. నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు లేదు. అందుకే వారి మృతదేహాలను జైలు వెనుక గోడలు పగులగొట్టి రహస్యంగా తీసుకెళ్లి సట్లెజ్ నది తీరాన దహనం చేశారు. మృతదేహాలు ప్రజల కంటబడితే ఉపద్రవం ముంచుకొస్తుందనే ఇలా చేశారు. తల్లి భారతికి స్వేచ్ఛనందించి, తమ రుణం తీర్చుకునే ఏకైక లక్ష్యంతో జీవితాలను పణంగా పెట్టిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు జాతి యావత్తూ రుణ పడి ఉంటుంది. వారి స్ఫూర్తితో మనం జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం. జాతీయత, దేశం కోసం సమయం కేటాయించి ఆ వైపు అడుగులు వేద్దాం.