News

కాశ్మీర్‌కు పొంచిఉన్న ‘ఉగ్ర’ ముప్పు – పదివేల మంది అదనపు పారామిలటరీ బలగాల తరలింపు

567views

మ్ముకాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రదాడికి సిద్ధమవుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మరో పదివేల మంది భద్రతా దళాలను పంపించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకటి, రెండు రోజుల్లో సీనియర్ అధికారులతో సమావేశమై జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతోంది. భద్రతా దళాలు లేదా అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పెద్దఎత్తున దాడులు చేసే ప్రమాదం ఉన్నదని భారత గూఢచార సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిసింది. జాతీయ భద్రతా వ్యవహాల సలహాదారు అజిత్ దోవల్ రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో సైనిక, సీఆర్‌పీఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులు, గూఢచార సంస్థ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌కు అదనంగా మరో పదివేల మంది భద్రతా సిబ్బందిని పంపించినట్లు తెలిసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ సంస్థలు జమ్ముకాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాదాడికి సిద్ధమవుతున్నట్లు భారత నిఘా సంస్థ ‘రా’, ఇంటలిజెన్స్ బ్యూరో ఇతర గూఢచార సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం అందజేసినట్లు తెలిసింది. ఉగ్రవాదుల దాడులను తప్పికొట్టేందుకు ఏం చేయాలనే విషయంపై లోతుగా చర్చించిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం అదనంగా పదివేల మంది భద్రతా సిబ్బందిని జమ్ముకాశ్మీర్‌లో మోహరించాలనే నిర్ణయం తీసుకున్నదని అంటున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం ఇప్పటికే నలభై వేల మంది దళాలను మోహరించారు. దీనికితోడు జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు మరి కొన్ని వేల భద్రతా దళాలు పని చేస్తున్నాయి.

జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. పంచాయతీ ఎన్నికల మాదిరిగా శాసనసభ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగితే ప్రజల్లో మార్పు వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని భావిస్తున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ రాష్ట్రంలో పెద్దఎత్తున దాడులు జరిపించేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులను సిద్ధం చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రానికి అదనంగా తరలించిన పదివేల మంది భద్రతా సిబ్బందిని అత్యంత కీలక ప్రాంతాల్లో మోహరించిటం కూడా పూర్తయిందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.