News

ప్రారంభమైన అన్నవరం ప్రసాదం స్టాల్‌

241views

కాకినాడ జిల్లా అన్నవరంలోని జాతీయ రహదారిపై స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో విశాఖపట్నం– రాజమహేంద్రవరం వైపు దేవస్థానం స్థలంలో నిర్మిస్తున్న సత్యదేవుని నమూనా ఆలయం వద్ద స్వామివారి ప్రసాదం స్టాల్‌నురాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖపట్నం వైపు ప్రయాణించే జాతీయ రహదారిపై గల సత్యదేవుని ప్రసాదం స్టాల్‌లో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం విక్రయిస్తున్నారు. అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు జాతీయ రహదారిపై ప్రయాణించే భక్తులు స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేసేందుకు జాతీయ రహదారిని దాటి ప్రసాదాల కౌంటర్‌ వద్దకు రావల్సి వస్తోంది. ఈ సమయంలో వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక డిగ్రీ కళాశాల వద్ద విశాఖపట్నం– విజయవాడ రహదారిని ఆనుకుని అక్కడే ప్రసాదం స్టాల్‌ ఏర్పాటు చేశారు. త్వరలో సత్యదేవుని నమూనా ఆలయం కూడా నిర్మించాలని నిర్ణయించారు.