News

యూపీ మతమార్పిడి నిరోధక చట్టం సహజీవన సంబంధాలకూ వర్తిస్తుంది

211views

ఉత్తర్‌ప్రదేశ్‌ మతమార్పిడి నిరోధక చట్టం.. కేవలం వివాహాలకే కాకుండా సహజీవన సంబంధాలకూ వర్తిస్తుందని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. పోలీసు రక్షణ కోరుతూ ఓ హిందూ-ముస్లిం జంట దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మతాంతర జంటలు మతం మారాలనుకుంటే చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్లు చట్టంలోని సెక్షన్‌ 8, 9 ప్రకారం మతం మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోలేదని, కాబట్టి వారి బంధానికి రక్షణ కల్పించలేమని తెలిపింది. తప్పుడు ప్రాతినిధ్యం, బలప్రయోగం, అనుచిత ప్రభావం, ఆశ చూపడం లేదా మోసపూరిత విధానాలతో జరిగే మత మార్పిడిని చట్టంలోని సెక్షన్‌ 3(1) అనుమతించదని పేర్కొంది. ‘‘ఈ రోజు వరకు పిటిషనర్లలో ఏ ఒక్కరిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. వారి బంధాన్ని కూడా ఎవరూ సవాల్‌ చేయలేదు’’ అని పేర్కొంటూ మతాంతర జంటకు రక్షణను న్యాయస్థానం తిరస్కరించింది.