News

అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

311views

రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌’ (ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. ఈ ప్రయోగం గురించి ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరినట్లు రక్షణశాఖ ప్రకటించింది. బహుళ రీఎంట్రీ వెహికల్స్‌ను వివిధ టెలిమెట్రీ, రాడార్‌ కేంద్రాలు నిశితంగా పరిశీలించాయని తెలిపింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’కు ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించారు.

ఏమిటీ క్షిపణి?
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన క్షిపణుల్లో ‘అగ్ని-5’ అత్యంత శక్తిమంతమైంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారు. ఆ దేశం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని చేరుకోగలవు. అవి 1990ల నుంచి భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి.
ఎంఐఆర్‌వీ అంటే..

అగ్ని-5ను భారత్‌ గతంలో అనేకసార్లు పరీక్షించింది. అయితే ఎంఐఆర్‌వీతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఒక క్షిపణి తన వార్‌హెడ్‌తో ఒక లక్ష్యంపైనే దాడి చేస్తుంది. ఎంఐఆర్‌వీ సాంకేతికత వల్ల ఒకే క్షిపణిలో బహుళ వార్‌హెడ్లను అమర్చవచ్చు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో అవి.. ప్రధాన అస్త్రం నుంచి విడిపోతాయి. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించగలవు. భిన్న వేగాల్లో, భిన్న దిక్కుల్లో ప్రయాణించగలవు. వాటి ద్వారా ఏకకాలంలో అనేక లక్ష్యాలపై దాడి చేయవచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల మధ్య దూరం వందల కిలోమీటర్లు ఉన్నా.. ఇబ్బంది లేదు. 4-12 వార్‌హెడ్లను మోసుకెళ్లేలా అగ్ని-5ను తీర్చిదిద్దుతామని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు గతంలో తెలిపారు.

ఎంఐఆర్‌వీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టం. దీనికి భారీ క్షిపణులు, చిన్న వార్‌హెడ్‌లు, అత్యంత కచ్చితత్వంతో కూడిన మార్గనిర్దేశక వ్యవస్థ, ఒక క్రమపద్ధతిలో వార్‌హెడ్‌లను విడుదల చేసే సంక్లిష్ట యంత్రాంగం అవసరం. తాజాగా ప్రయోగించిన అగ్ని-5 ఎంఐఆర్‌వీలో స్వదేశీ ఏవియానిక్స్‌ వ్యవస్థలు, అత్యంత కచ్చితత్వంతో కూడిన సెన్సర్‌ వ్యవస్థలు ఉన్నాయి. వీటి సాయంతో రీఎంట్రీ వెహికల్స్‌.. లక్షిత ప్రాంతాన్ని చేరుకోగలిగాయి.