News

కెనడాలో నిజ్జర్‌ హత్య దృశ్యాలు వెలుగులోకి..

408views

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఘటన భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రూడో సర్కారు దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత హత్యకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో దుండగులు నిజ్జర్‌ వాహనాన్ని అడ్డగించి తూటాల వర్షం కురిపించినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారినట్లు కెనడాకు చెందిన సీబీసీ న్యూస్‌ వెల్లడించింది.

2023 జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆరుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి చంపినట్లు తాజా వీడియోలో ఉంది. నిజ్జర్‌ తన గ్రేకలర్‌ పికప్‌ ట్రక్‌లో గురుద్వారా నుంచి బయటకు వెళ్తుండగా.. ఓ సెడాన్ వేగంగా వచ్చి అడ్డగించింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో పాయింట్‌ బ్లాంక్‌ రేంజి నుంచి తూటాల వర్షం కురిపించారు. అనంతరం మరో కారులో అక్కడి నుంచి పారిపోయినట్లుగా ఆ దృశ్యాల్లో కన్పించింది.

ఈ ఘటనపై రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానితులను గుర్తించలేదు. ఎవర్నీ అరెస్టు చేయలేదు. గతంలో ఈ ఫుటేజీ గురించి అమెరికా మీడియా కూడా కథనాలు ప్రచురించింది.

నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ట్రూడో ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే.. పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్‌ స్పష్టంగా చెప్పింది.