
వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. చదువుతోపాటు సంస్కృతి-సంప్రదాయాలు, వేద అధ్యయనం అక్కడ నిత్యకృత్యంగా మారింది. దీంతో వారిలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలంలోని చేవూరులో ఉన్న రామదూత ఆశ్రమ పాఠశాలలో. అనాథ, పేద పిల్లలకు విద్యాభ్యాసం అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ ఉచితంగా విద్యనందిస్తున్నారు. అయితే, సాధారణ ఆంగ్ల విద్యతోపాటు వారికి వేదాలు నేర్పుతుండటం విశేషం. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి వీటిని నేర్పిస్తున్నారు. వేద పాఠశాలల్లో ఉండేవిధంగా ఇక్కడ నేర్పుతుండటంతో విద్యార్థులు అలవోకగా చెప్పేస్తున్నారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పూర్ణానంద దీక్షితులు మొత్తం 22 మంది విద్యార్థులకు వీటిని నేర్పిస్తున్నారు.
వేద అధ్యయనంతో ఉత్సాహం
మాది కావలి. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. మంత్రోచ్చరణ కష్టం అంటుంటారు. కానీ, మాకు ఇక్కడ ఉపాధ్యాయులు చెబుతున్న మను సూక్తం, పురుషసూక్తాలు, నారాయణ మంత్రం ఎంతో సులభంగా ఉంది. ఉదయాన్నే వీటిని వల్లె వేస్తుండటంతో రోజంతా ఉత్సాహంగా ఉంటోంది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కావాలనేది లక్ష్యం. నాకు వివేకానందుడు ఆదర్శం.టి.కిశోర్, ఎనిమిదో తరగతి
స్పష్టంగా పలుకుతున్నా

మాది కావలి దగ్గర పల్లెటూరు. మూడేళ్ల నుంచి ఇక్కడ చదువుతున్నా. ఇంతకుముందు తెలుగు చదవడానికి సరిగారాదు. స్పష్టత ఉండేది కాదు. సంవత్సరం నుంచి మన్యుసూక్తం, శ్రీసూక్తం నేర్చుకుంటున్నా. ప్రస్తుతం సంస్కృత పదాలు స్పష్టంగా పలుకుతున్నా. అవి చదువుతున్నప్పుడు మానసికానందం ఉంది.కె.జగదీశ్, ఆరో తరగతి
శ్లోకాలు నేర్చుకుంటున్నాం

భారతీయ సంస్కృతి గురించి వివేకానందుడు విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. చిన్నప్పటి నుంచే సంస్కృత శ్లోకాలను చదవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటోంది. భవిష్యత్తు తరాలకు వేదాలను, వాటి గొప్పతనాన్ని అందించడానికి అందరు కృషి చేయాలి. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి శ్రీసూక్తం, మంత్రపుష్పం లాంటి వాటిని నేర్చుకోవాలి. దీనివల్ల సాధారణ చదువులో చురుగ్గా ఉంటున్నాం.కె.మధు, వి.శివదుర్గ, ఎనిమిదో తరగతి
మంచి మార్కులొస్తున్నాయి
మాది కావలి సమీపంలోని రాముడుపాలెం. మా తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. సూక్తాల కంఠస్థంతో ఎంతో ఆనందంగా ఉంది. మానసిక ప్రశాంతతతోపాటు మంచి మార్కులు వస్తున్నాయి. శాస్త్రవేత్త కావాలనేది నా లక్ష్యం.కె.యశ్వంత్, ఆరో తరగతి





