News

ఏడాదికో శివరాత్రి.. ఇప్పుడైనా పట్టదా

293views

ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడున్న ఆలయాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. ఎంతో పురాణ ప్రాశస్థ్యమున్న కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అలాంటి గుడి సరైన నిర్వహణ లేక వెలవెలబోతోంది. యంత్రాంగం పర్యవేక్షణ లోపం, భక్తుల అవగాహన రాహిత్యంతో సమస్యలు తాండవిస్తున్నాయి. ఈనెల 8న మహాశివరాత్రి నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.పితృ కర్మల కోసం విజయవాడకు చెందిన ఓ కుటుంబం ఈనెల 4న గోష్పాద క్షేత్రానికి వచ్చింది. గోదావరిలో దిగేందుకు సిద్ధమై మొదటి మెట్టుపై అడుగు వేయగానే నాచుతో జారి పడిపోయారు. అక్కడున్న వారు స్పందించి ఆసుపత్రికి తరలించారు.

ప్రధాన రేవులో మెట్లు నాచు పట్టి అడుగేస్తే జారిపోయేలా ఉన్నాయి. రేవు పొడవునా పూజా ద్రవ్యాల వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారాలు, అపర కర్మలకు వచ్చిన వారు విడిచిన బట్టలు కనిపిస్తున్నాయి. పుణ్యస్నానాలు చేసే భక్తులు దుస్తులు మార్చుకోవడం పరీక్షగా మారుతోంది. మూడుచోట్ల తాత్కాలికంగా గదులు పెట్టినా తలుపులు లేవు. ఒకచోట ఉన్నా అది పక్కకు ఉంచారు. దీంతో మహిళలకు అవస్థలు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ భారత్‌ నిధులతో క్షేత్రం ప్రారంభంలో మరుగుదొడ్లు నిర్మించినా ఒక్కచోటే పని చేస్తోంది. లక్షలాది నిధులు వెచ్చించి నిర్మించినవి అలంకారంగా మారాయి. మోటారు పనిచేయక, పైపులైను వ్యవస్థ లేక తాళాలు వేసి ఉంచారు.

ప్రమాదాలు జరగకుండా రక్షణ అవసరం..
సాధారణంగా శివరాత్రికి నదిలో ఉద్ధృతి పెరుగుతుంటుంది. స్నానాలకు పెద్దగా అవస్థ ఉండదు. ప్రస్తుతం ప్రధాన రేవుల్లో నీరు తక్కువగా ఉంది. పూజాద్రవ్యాల వ్యర్థాలు, చెత్తాచెదారాలు ఉన్నాయని, నీరు తక్కువగా ఉందని ముందుకు వెళితే అమాంతం లోతు పెరిగిపోయి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. జల్లు స్నానాలపై శ్రద్ధ పెట్టాలి. క్షేత్రంలో ఇబ్బందులపై సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. భక్తుల భద్రతకు పడవలతో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. మౌలిక సదుపాయాలు, బందోబస్తు, భద్రతపై ఆయా శాఖలకు ఆదేశాలిచ్చామన్నారు.