
టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతి రోజూ లక్ష మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారన్నారు. గతంలో నేను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాం అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పిఏసిలు తదితర ప్రాంతాల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన్నట్లు చెప్పారు. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని తన చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. టీటీడీ ఛైర్మన్‌గా శ్రీ గోవిందరాజు స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతి రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఈ అన్నదాన కార్యక్రమాన్నిమరింతగా విస్తరిస్తారించనున్నట్లు వివరించారు.





